పవన్‌ ప్రమాణస్వీకారంలో ఇదే హైలెట్‌!

అనేక ఊహాగానాల నడుమ ఎట్టకేలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.

Update: 2024-06-12 07:08 GMT

అనేక ఊహాగానాల నడుమ ఎట్టకేలకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. పవన్‌ తో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. పవన్‌ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. భారీ ఎత్తున తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానుల కేరింతల మధ్య పవన్‌ ఎక్కడా తొట్రుపాటు లేకుండా ప్రమాణం చేశారు.

ఆ తర్వాత వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు నమస్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. పవన్‌ ను భుజం తట్టి అభినందించారు. అలాగే చంద్రబాబు సైతం పవన్‌ కు అభినందనలు తెలిపారు. కొద్ది క్షణాల పాటు వారిద్దరు ముచ్చటించుకున్నారు.

ఆ తర్వాత పవన్‌ వేదికపై ఉన్న రాజకీయ ప్రముఖులు.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ దంపతులు, ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ సీఎం రమేశ్‌ లకు వరుసగా నమస్కరించారు.

అన్నింటిలో కంటే హైలెట్‌.. రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట అతిథిగా ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వచ్చిన తన సోదరుడు, మెగాస్టార్‌ చిరంజీవి కాళ్లకు నమస్కరించిన పవన్‌ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ ను చిరంజీవి ఆప్యాయంగా హత్తుకున్నారు. అటు పవన్, ఇటు చిరంజీవి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. పవన్‌ ప్రమాణస్వీకారం చేసేటప్పుడు సైతం ఆయనను చూయిస్తూ రజినీకాంత్‌ కు చిరంజీవి సంతోషంతో ఏదో చెప్పడం కనిపించింది.

ఇక మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక వేదికపై ఉన్న వారికి పవన్‌ నమస్కరిస్తున్న క్రమంలో వేదికపై ఉన్న జాతీయ ప్రముఖులు.. పవన్‌ కళ్యాణ్‌ ను చూడటానికి ఒకింత ఆసక్తిని ప్రదర్శించారు. ఇటీవల ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో ఢిల్లీలో ప్రధాని మోదీ.. పవన్‌ పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. పవన్‌ కాదు.. తుఫాన్‌ అంటూ అభినందనల జల్లు కురిపించారు. ఈ నేపథ్యంలో పవన్‌ తమకు నమస్కరించడానికి వచ్చినప్పుడు వేదికపై ఉన్నవారంతా లేచినిలబడటం విశేషం.

కాగా ఇటీవల ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 70 వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

Full View

Tags:    

Similar News