అసెంబ్లీలో పవన్...గేటు టచ్ చేయలేకపోయిన కొడాలి!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొలిరోజు శాసన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా, రేపు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ల ఎన్నిక లాంఛనంగా జరగనుంది. సభలో కూటమిమే మెజారిటీ ఉండడం, వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో ఎన్నిక లేకుండానే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడ, డిప్యూటీ స్పీకర్ గా లోకం మాధవిలు ఎంపికయ్యే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ’’పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ్యుడిగా సభ నియమాలకు కట్టుబడి ఉంటానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను‘‘ అంటూ పవన్ ప్రమాణ స్వీకారం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటూ వైసీపీ నేతలు సవాల్ విసిరిన నేపథ్యంలో ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఈ క్రమంలోనే పవన్ ప్రమాణస్వీకారం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హైలైట్ గా నిలిచింది.
2019లో గాజువాక, భీమవరం రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అంటూ మాజీ మంత్రి కొడాలి నాని చాలెంజ్ చేశారు. అయితే, ఇప్పుడు అదే కొడాలి నాని తన కంచుకోట గుడివాడలో ఘోర పరాజయంపాలు కాగా పవన్ కళ్యాణ్ మాత్రం 70 వేల భారీ మెజారిటీతో గెలిచి పిఠాపురం శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ పవన్ అసెంబ్లీలో ప్రమాణం చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ సభలో ముందు వరుసలో కూర్చుంటే...అసెంబ్లీ గేటు దాటి లోపలకు రాలేని స్థితిలో ఘోర పరాజయం పాలైన కొడాలి నాని ఉన్నారని పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.