ఏంది పెద్దిరెడ్డి.. అనటం ఎందుకు అనిపించుకోవటం ఏల?
కీలక స్థానాల్లో ఉన్న వారు.. పార్టీకి ముఖ్యనేతలుగా వ్యవహరించే వారు.. తాము చేసే వ్యాఖ్యల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి.
కీలక స్థానాల్లో ఉన్న వారు.. పార్టీకి ముఖ్యనేతలుగా వ్యవహరించే వారు.. తాము చేసే వ్యాఖ్యల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలి. ఎందుకంటే.. ఒక పార్టీలో ఒక నేతపై విమర్శలు రావటం ఒక ఎత్తు.. కీలక నేతపై విమర్శలు రావటం మరో ఎత్తు. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సీరియస్ అయ్యారు.
దీనికి కారణం.. మంత్రి పెద్దిరెడ్డి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలే కారణమని చెప్పాలి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బీజేపీ తరఫున బరిలో నిలవాలని సత్యకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సత్యకుమార్ ను ఉద్దేశించి మంత్రి పెద్ది రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అతడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ ఉంటారు తెలీదు’ అంటూ మండిపడ్డారు.
దీనిపై తాజాగా సత్యకుమార్ స్పందించారు. తాను ఎక్కడ పుడితే మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకు? అన్న ఆయన.. ‘నీ మాదిరి రాష్ట్రాన్ని దోచుకు తినలేదు. ప్రజల్ని పీడించలేదు’ అంటూ విరుచుకుపడ్డారు. తనపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్టు అయిన సత్యకుమార్ మరిన్ని మాటల్ని అనేశారు. రాష్ట్రం మీ సామ్రాజ్యం అనుకుంటున్నారా? బీసీలు మీ బానిసలు అనుకుంటున్నారా? అంటూ తనకు లభించిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించేసుకున్నారు.
తన విమర్శల పరంపరను మంత్రి పెద్దిరెడ్డి వరకు పరిమితం చేయని సత్యకుమార్.. వైసీపీ అధినేత జగన్ కుటుంబ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘ఎక్కడ పుట్టారని మీ నాయకుడి తల్లిని విశాఖపట్నంలో పోటీకి నిలబెట్టారు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టుచేసిన పోస్టు చూసిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి నాలుకను కాస్తంత కంట్రోల్ లో పెట్టాల్సిన అవసరం ఉందన్న భావన కలుగక మానదు. ఈ ఎపిసోడ్ ను చూసినోళ్లంతా.. అనటం ఎందుకు? అనిపించుకోవటం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా.. ఎన్నికల వేళ.. ఇన్నేసి మాటలు అనిపించుకోవటంలో అర్థం లేదన్న విషయాన్ని పెద్దిరెడ్డి సాబ్ ఎప్పటికి గుర్తిస్తారో?