ఆ నియోజకవర్గంలో రాజకీయం మలుపులు మీద మలుపులు!
విజయవాడకు అతి సమీపంలో ఉన్న పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ మలుపులు ఊహకందని విధంగా తిరుగుతున్నాయి.
విజయవాడకు అతి సమీపంలో ఉన్న పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ మలుపులు ఊహకందని విధంగా తిరుగుతున్నాయి. ప్రస్తుతం పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా కొలుసు పార్థసారధి ఉన్నారు. ఈసారి వైసీపీ అధినేత జగన్ ఆయనకు సీటు కేటాయించలేదు. మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించారు. ఇందుకు ఇష్టపడని పార్థసారథి వైసీపీ నుంచి తప్పుకున్నారు.
దీంతో పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం పెడన ఎమ్మెల్యేగా, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న జోగి రమేష్ ను జగన్ ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో జోగి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మరోవైపు పెనమలూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు టీడీపీ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఆయన ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. కొలుసు పార్థసారధిని నూజివీడు నుంచి పోటీ చేయించడానికి నిర్ణయించారు. ఈ మేరకు పార్థసారధి నూజివీడులో పర్యటించారు. అక్కడ కీలక టీడీపీ నేతలను కలిశారు.
ఇంకోవైపు నూజివీడులో ప్రస్తుతం టీడీపీ ఇంచార్జిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన కొలుసు పార్థసారధి రాకను వ్యతిరేకిస్తున్నారు. అటు ముద్రబోయిన, ఇటు కొలుసు ఇద్దరూ యాదవ సామాజికవర్గానికి చెందినవారే. నూజివీడుకు వచ్చిన కొలుసు.. ముద్రబోయినను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేకపోవడంతో కలవలేకపోయారు. ఈ క్రమంలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఉండవల్లిలో చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. నూజివీడులో గత పదేళ్లుగా టీడీపీ ఎమ్మెల్యే లేకపోయినా పార్టీ శ్రేణులకు అండగా ఉన్నానని, తనకే సీటు ఇవ్వాలని కోరారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో ఫిబ్రవరి 17 శనివారం ఉదయం నుంచి పెనమలూరు నుంచి కొలుసు పార్థసారథి అభ్యర్థిత్వంపై .. ఫోన్ ద్వారా సర్వే చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు విస్తృతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
"నేను మీ చంద్రబాబు నాయుడిని... పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా .. కొలుసు పార్ధసారధిగారైతే 1 నొక్కండి... నోటా అయితే 2 నొక్కండి".. అంటూ పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే ఈ సర్వేలో ప్రస్తుత పెనమలూరు టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే నూజివీడు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న కొలుసు పార్థసారధి తన రాకను నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. తాను నూజివీడులో గెలుపొందడం ఖాయమని చెప్పారు. మళ్లీ ఇంతలోనే పెనమలూరు నుంచి కొలుసు పార్థసారధి పేరుతో టీడీపీ సర్వే నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.