నిన్న మోడీ నేడు పవన్ ఫోటోలు మిస్....ఏం జరుగుతోంది !

మార్చి 16న చిలకలూరిపేట సభలో డబుల్ ఇంజన్ సర్కార్ అని మోడీ ప్రచారం చేశారు.

Update: 2024-05-02 15:53 GMT

టీడీపీలో మూడు పార్టీలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం అయితే రెండవది భారతీయ జనతా పార్టీ, మూడవది జనసేన. ఈ మూడు పార్టీలు కలసి ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. మార్చి 16న చిలకలూరిపేట సభలో డబుల్ ఇంజన్ సర్కార్ అని మోడీ ప్రచారం చేశారు.

ఆ తరువాట కూటమి ఎన్నికల ప్రచారం మొదలెట్టింది. అలా సూపర్ సిక్స్ పేరుతో ముద్రించిన కరపత్రాలు ఇంటింటికీ పంచిన దాంట్లో మోడీ పవన్ చంద్రబాబు ముగ్గురు ఫోటోలు ఉన్నాయి. కానీ నెలన్నర గడవక ముందే మోడీ ఫోటో కూటమి ఉమ్మడి ఎన్నికల మ్యానిఫేస్టో నుంచి మాయం అయింది. ఇపుడు తెలుగుదేశం పార్టీ పత్రికలకు ఇస్తున్న ఫుల్ పేజీ ప్రకటనలో ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోని కూడా లేపేశారు ఇదేక్కడి చోద్యం అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ దిన పత్రికలకు చంద్రబాబు ఇచ్చిన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా హామీలు కొన్ని లేపేశారు అని ఆరోపించారు. సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్రతీ నెలా ఇస్తామన్న హామీ అయితే ప్రకటనలలో ఎక్కడా లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే తరహాలో మరికొన్ని ముఖ్యమైన హామీలు కూడా లేకుండా జాగ్రత్త పడిపోతున్నారని అన్నారు.

చంద్రబాబు 2014లో అనేక హామీలు వందల కొద్దీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఆనాడు ఎన్నికల మ్యానిఫేస్టో మీద చంద్రబాబుతో పాటు మోడీ పవన్ బొమ్మలు వేశారని తీరా ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్లనే బీజేపీ దూరం అయింది అన్నారు ఇపుడు కూడా బాబు ఇచ్చిన హామీల లెక్క చూస్తే ఏడాదికి రెండు లక్షల దాకా ఖర్చు భారీగా అవుతుందని అందుకే ఈ ఆర్ధిక భారానికి తాము సాయం చేయలేమని బీజేపీ ముందే పక్కకు తప్పుకుందని ఆయన ఎద్దేవా చేశారు.

ఇక కూటమి మ్యానిఫేస్టోలో కనిపించిన పవన్ బొమ్మ పత్రికా ప్రకటనలలో ఎందుకు లేదు అని ఆయన నిలదీసారు. ఇదంతా బాబు మార్క్ రాజకీయ మాయాజాలమని అందులో ఆటలో అరటిపండు పాత్రలలో మోడీని పవన్ ని వాడుకుంటున్నారు అని పేర్ని నాని దుయ్యబట్టారు. బాబు వందల హామీలు ఆనాడు ఇస్తే వాటికి దిక్కే లేదని గుర్తు చేశారు.

ఇపుడు తగుదునమ్మా అని మరిన్ని కొత్త హామీలతో వస్తున్నారు అని విమర్శించారు. ఎన్నికల తరువాత హామీలు మరచిపోవడం, ఎన్నికల మ్యానిఫేస్టోని మాయం చేయడం బాబుకు అలవాటు అని ఇపుడు ఇంకా పోలింగ్ కూడా జరగకముందే హామీలు మాయం చేయడమేంటి అని ఆయన ప్రశ్నించారు.

ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సొంత మామ ఇచ్చిన హామీలు అన్నింటినీ పక్కన పెట్టేశారని గుర్తు చేశారు. ఇక 1999లో బాబు ఇచ్చిన మ్యానిఫేస్టోలో చూస్తే ఉమ్మడి ఏపీలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తాను లేకపోతే కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి ఆర్ధిక సాయం చేస్తాను అని ఎన్నికల మ్యానిఫేస్టోలో హామీలు గుప్పించారని గుర్తు చేశారు.

అలాగే బలహీన వర్గాలకు ముప్పయి అయిదు లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పారని, ఏపీలో ప్రతీ ప్రభుత్వ పాఠశాలకూ పక్క భవంతి నిర్మించి ఇస్తామని కూడా చెప్పారని ఆనాటి మ్యానిఫేస్టోని చదివి వినిపించారు. ఇలా అనేక హామీలు ఇచ్చినా బాబు వాటిని ఎక్కడా అమలు చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు.

అదే విధంగా 2004లో హామీలు ఇచ్చిన జనాలు నమ్మలేదని, 2009లో ఆల్ ఫ్రీ బాబుగా అవతారం ఎత్తినా ఓడించారని పేర్ని నాని విమర్శించారు. ఇక చూస్తే 2014లో రైతు రుణ మాఫీ వంటి భారీ హామీని సైతం అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. పుట్టిన ప్రతీ ఆడబిడ్డ ఖాతాలో ఇరవై అయిదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారని కూడా గుర్తు చేశారు. ఇలా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే మ్యానిఫేస్టోనే బుట్ట దాఖలు చేసిన ఘనత బాబుదే అని ఎద్దేవా చేశారు

ఇపుడు చూస్తే 2024లో భారీ ఎన్నికల హామీలతో బాబు ముందుకు వచ్చారని విమర్శించారు. గతంలో ఏ ఒక్క హామీ నెరవేర్చని బాబు ఇపుడు మళ్ళీ నిరుద్యోగ భృతి అంటున్నారని, మూడు సెంట్ల ఇళ్ళ స్థలం అని చెబుతున్నారని ఆయన నమ్మవచ్చా అని ప్రశ్నించారు. బాబు హామీలు నీటి మూటలు అని జనాలకు తెలుసు అని ఈ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెబుతారు అని పేర్ని నాని హెచ్చరించారు. తనకే తెలివి ఉందని బాబు అనుకుంటున్నారని తన కొడుకుని సీఎం చేయడానికి అధికారం కోరుతున్నారని ప్రజలు తెలివైన వారు అని కర్రు కాల్చి వాత పెట్టి పంపిస్తారని ఆయన స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News