కూటమిలో ఫొటోల కుస్తీ.. బాబు సైలెంట్.. !
వీటిస్థానంలో కూటమిగా బీజేపీ-టీడీపీ-జనసేనను ముందుకు నడిపించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఫొటోలు పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఫొటోల వ్యవహారం వివాదంగా మారుతోంది. ప్రస్తుతం కూటమికి సారథ్యం వహిస్తున్న టీడీపీలో అయితే.. ఈ ఫొటోల వ్యవహారం మరింతగా దుమారం రేపుతోంది. రాష్ట్రంలో గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరి ఫొటోలు పెట్టాలనే చర్చ తెరమీదికి వచ్చింది. వైసీపీ హయాంలో ప్రతి కార్యాలయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోలను విధిగా పెట్టారు. అదేసమయంలో ఆయన ఫొటోలను పలు పథకాలపైనా ముద్రించారు.
కూటమి సర్కారు వచ్చీరావడంతో జగన్ ఫొటోలు తొలగించింది. వీటిస్థానంలో కూటమిగా బీజేపీ-టీడీపీ-జనసేనను ముందుకు నడిపించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఫొటోలు పెట్టాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. దీంతో ప్రస్తుతం అన్ని శాఖల కార్యాలయాలు, కలెక్టర్ ఆఫీసుల్లోనూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇది గత కొన్నాళ్లుగా అన్ని ఆఫీసుల్లోనూ కనిపిస్తోంది. అయితే.. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా ఫొటోల ప్రకటనలు వస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం కాకుండా ఉంచడంతోపాటు.. ఇటీవల బడ్జెట్‌లోనూ ఏపీకి సంబంధించి కీలక ప్రతిపాదనలు చేసిన తమ నేతలకు కూడా ప్రాధాన్యం ఉండాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోను కూటమి ప్రభుత్వం అన్ని కార్యాలయాల్లోనూ పెట్టించాలని పట్టుబడుతున్నారు. అయితే.. ప్రస్తుతం గవర్నర్ కార్యాలయాల్లో మాత్రమే పీఎం ఫొటోలు ఉంటున్నాయి. మిగిలిన ఆఫీసుల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలే ఉంటున్నాయి.
దీంతో తమ నాయకుడు నరేంద్ర మోడీ ఫొటోను కూడా జోడించాలని కమల నాథులు కోరుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ నేతల వాదన మరోలా ఉంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఫొటోను కూడా కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలన్నది వారి డిమాండ్‌గా ఉంది. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు 3 వేల కిలో మీటర్లకు పైగానే నారా లోకేష్ పాదయాత్ర చేశారని.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంతోపాటు.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఫొటో పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతున్నా.. సీఎం చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం కానీ స్పందించకపోవడం గమనార్హం.