మనిషికి పంది మూత్రపిండం.. విజయవంతంగా పనిచేస్తున్న అవయవం!

ఇలాగే మూత్రపిండం అవసరమైన వ్యక్తికి పంది మూత్రపిండాన్ని అమర్చారు. అయితే అది రెండు రోజులకు మించి పనిచేయలేదు.

Update: 2023-08-17 07:39 GMT

మనుషులకు జంతువుల అవయవాలను అమర్చడం పురాతన కాలం నుంచి ఉన్నదేనని మనం పురాణాల్లో చదువుకున్నాం. వినాయకుడికి ఏనుగు తలను అమర్చడం తెలిసిన సంగతే. వివిధ ప్రమాదాల బారిన పడి, వివిధ జబ్బుల వల్ల వివిధ అవయవాలు పోగొట్టుకున్నవారు, వారి కుటుంబ సభ్యులు పడే యాతన అంతా ఇంతా కాదు. మనదేశంలోనే కొన్ని లక్షల మంది కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, గుండె వంటి అవయవాల కోసం నిరీక్షిస్తున్నారు. ఎవరైనా బ్రెయిన్‌ డెడ్‌ అయితే వారి కుటుంబ సభ్యులను ఒప్పించి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తుల అవయవాలను కావాల్సిన వారికి అమరుస్తున్నారు. అయితే ఈ లోగా కావాల్సిన అవయవాలు దొరక్క కన్నుమూస్తున్నవారూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో అమెరికా వైద్యులు కీలక ముందడుగు వేశారు. మూత్రపిండాలు అవసరమైన వ్యక్తికి పంది మూత్రపిండాన్ని అమర్చారు. నెల రోజుల క్రితం ఆ వ్యక్తికి అమర్చగా ఇది విజయవంతంగా పనిచేస్తోందని చెబుతున్నారు. దీంతో మానవ అవయవాల కొరత తీర్చడంలో ముందడుగు పడినట్టేనని భావిస్తున్నారు.

ఈ మేరకు మానవులకు అవయవ దాతల కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్న వైద్యులు కీలక పురోగతిని సాధించారు. అమెరికాలోని న్యూయార్కులో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని వైద్యులు అమర్చారు. ఇది గత నెలరోజులుగా చక్కగా పనిచేస్తుండటం విశేషం.

కాగా గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే వైద్యులు చేశారు. ఇలాగే మూత్రపిండం అవసరమైన వ్యక్తికి పంది మూత్రపిండాన్ని అమర్చారు. అయితే అది రెండు రోజులకు మించి పనిచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పంది మూత్రపిండం అమర్చిన వ్యక్తికి నెల రోజులుగా పనిచేయడం అద్భుతమేనని అంటున్నారు.

బ్రెయిన్‌ డెడ్‌ అయిన 57 ఏళ్ల వ్యక్తికి ఆయన కుటుంబ సభ్యులను ఒప్పించి పంది మూత్ర పిండాన్ని అమర్చారు. జులై 14న ఈ ఆపరేషన్‌ నిర్వహించగా రెండో రోజు నుంచి ఇది చక్కగా పనిచేస్తోంది. గత ఏడాది కూడా మేరీలాండ్‌ వర్సిటీ వైద్యులు జన్యుమార్పిడి పంది గుండెను ఓ వ్యక్తికి అమర్చి చరిత్ర సృష్టించారు. అయితే ఆ వ్యక్తి రెండు నెలలు మాత్రమే జీవించారు.

కాగా తాజా ప్రయోగం నిర్వహించిన న్యూయార్క్‌ వర్సిటీకి చెందిన ట్రాన్స్‌ప్లాంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాబర్ట్‌ మాంట్గోమెరి ఆనందం వ్యక్తం చేశారు. మనుషులకు జంతువుల అవయవాలను అమర్చడంలో ఇదో ముందడుగని ఆయన తెలిపారు. నెల రోజుల నుంచి పంది మూత్రపిండం విజయవంతంగా పనిచేస్తుండటంతో రెండో నెలలోనూ ఆ అవయవం ఎలా పనిచేస్తుందో పరిశీలిస్తామని తెలిపారు.

Tags:    

Similar News