చేపల కోసం వల... బీజేపీకి చిక్కుతున్న తిమింగలాలు!
ఆకలితో ఉన్న వాళ్లకి రొట్టె ముక్క దొరికితే చాలు అనుకుంటారు.
ఆకలితో ఉన్న వాళ్లకి రొట్టె ముక్క దొరికితే చాలు అనుకుంటారు. కానీ అదేసమయంలో షడ్ర శోపేతమైన భోజనమే లభిస్తే.. ఆ ఆనందం వేరేగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అలానే ఉంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం మరో రేంజ్‌కు వెళ్లిందని బీజేపీ జాతీయ నేతలు జబ్బలు చరుచుకుంటు న్నారు. ఈ నెల 18న కేంద్రంలోని నరేంద్ర మోడీ సారథ్యంలో ఉన్న ఎన్డీయే పక్షాల నాయకులతో భేటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఈ సమావేశం అర్థం అంతరార్థం మొత్తం.. త్వరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న ఉమ్మడి పౌరస్మృతిపై చర్చించడం.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలసి కట్టుగా ముందుకు సాగడం.. కాంగ్రెస్ కూటమిని ఆదిలోనే అణిచేయడం అనే కీలకమూడు అంశాల అజెండాతో ముందుకు సాగాలని నిర్ణయించు కున్నారు. వీటిలోనూ ఉమ్మడి పౌరస్మృతిని అత్యంత కీలకంగా తీసుకున్నారు. అయితే.. ఎందుకైనా మంచిదని.. ఎన్డీయేలో లేని పార్టీలకు కూడా.. బీజేపీ వల విసిరింది.
దీంతో లెక్కకు మించి .. అన్నట్టుగా పార్టీలు క్యూకట్టాయి. అంతేకాదు.. అసలు ఎన్డీయే ను తీవ్రస్తాయిలో గతంలో ఏకేసిన పార్టీలు కూడా ఇప్పుడు మోడీ వెంట నడిచేందుకు రెడీ అయ్యాయి. తాజాగా యూపీకి చెందిన సుహేల్ భారతీయ సమాజ్ పార్టీ ఎన్డీయేలో చేరిపోయింది. అదేవిధంగా బిహార్‌కు చెందిన చిరాగ్ పాశ్వాన్ నిన్న మొన్నటి వరకు మోడీని విమర్శించి.. ఇప్పుడు ఆయన కూడా ఎన్డీయే అద్భుతః అని అంటున్నారు.
ఇక, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే కూడా.. తాజాగా రెండు వర్గాలుగా విడిపోయినా.. రెండు వర్గాలు కూడా.. మోడీకి జై కొట్టాయి. మొత్తానికి 18 నాటికి ఎవరు వస్తారో.. ఎవరు రారో.. అనే మీమాంసలో ఇంతకాలం ఉన్న బీజేపీకి చేపలు కాదు.. ఇప్పుడు తిమింగలాలే చిక్కుకోవడం.. ఆశ్చర్యంగాను, ఆనందంగాను ఉండడం గమనార్హం. ఈ పరిణామాలను గమనిస్తున్న జాతీయ రాజకీయ విశ్లేషకులు మొత్తానికి.. ఈడీ, సీబీఐలు బాగానే పనిచేస్తున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని ఎద్దేవా చేస్తున్నారు.