పోలవరం... నాడు-నేడు!!
ఏపీకి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఏపీకి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వ్యవహారం మరోసారి రాజకీయ రంగు పులుముకుంది. దీనికి కారణం.. గతంలో వైసీపీ హయాంలో ఏ తప్పు అయితే.. జరిగిందని అప్పటి టీడీపీ, జనసేన నాయకులు పట్టుబట్టి.. ఊరూ వాడా ప్రచారం చేశారో.. ఇప్పుడు కూడా అదే జరుగుతుండడం. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దల మాటే పైచేయిగా కనిపిస్తుండడం.
ఏంటీ వివాదం?
+ పోలవరం ప్రాజెక్టును ప్రారంభంలో అనుకున్న విధంగా ప్రణాళికా బద్ధంగా నిర్మాణం చేస్తే.. 150 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. అంటే.. ఇది 45.72 మీటర్లు. తద్వారా.. భారీ ఎత్తున నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే.. 194.6 టీఎంసీల నీటిని ఎల్లప్పుడూ నిల్వ చేసుకోవచ్చు. అంతేకాదు.. పారుతున్న నీటిలో 322 టీఎంసీలను వినియోగించవచ్చు.
+ అయితే.. ఇంత ఎత్తుతో(45.72 మీటర్లు) ప్రాజెక్టును నిర్మించేందుకు ఒడిశా ప్రభుత్వం దశాబ్దాలుగా తప్పుబడుతోంది. ఇదే జరిగితే.. తమ లోతట్లు జిల్లాలు మునిగిపోతాయని పేర్కొంది. ఇక, నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈవివాదం నలుగుతున్నా.. ఈ ఏడాది ఒడిశాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఎత్తును తగ్గించాలన్న.. ప్రతిపాదనను కేంద్రం ఓకే చేసింది. అంతేకాదు.. అక్కడి ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చింది. ఇదే ఇప్పుడు జరిగింది.
+ వాస్తవానికి జగన్ హయాంలోనూ.. ఇదే పేచీ వచ్చింది. పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు పరిమితం చేయాలని కేంద్రం ఒత్తిడి తెచ్చింది ఇలా అయితే.. నిధులు ఇస్తామంది. అంతేకాదు.. 41.15 మీటర్లకే పరిమితమై.. పోలవరం అంచనాలను ఖరారు చేసింది. రాష్ట్రం 55 వేల కోట్లు ఇవ్వాలని చెబుతుండగా.. కాదు 35 వేల నుంచి 38 కోట్ల మధ్యే ఇస్తామని చెప్పడానికి కారణం ``ఎత్తే``!!
+ ఈ వ్యవహారంపై జగన్ హయాంలో రాజకీయం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున వైసీపీ సర్కారును విమర్శించారు. సరే.. ప్రజలకు మంచి చేయాలని అనుకుని.. ప్రతిపక్షం విమర్శించడం తప్పుకాదు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక.. ఈ అంశంపైనే.. రాజీ పడడం వివాదంగా విస్మయంగా మారింది. కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే అయినా.. బీజేపీ పెద్దలు నిర్ణయించిన 41.15 మీటర్లకే ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఇది మున్ముందు.. రాష్ట్ర ప్రయోజనాలను ఇబ్బంది కలిగించే అంశంగా మారింది.
4.69 మీటర్లు తగ్గిందే!
పోలవరం ఎత్తు 4.69 మీటర్లు తగ్గినంత మాత్రాన ఏం జరిగిపోతుందన్న అనుమానం రావొచ్చు. దీనివల్ల 79 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కోల్పోవడంతోపాటు.. దిగువ ప్రాంతాలకు సమర్థవంతమైన విధానంలో నీటిని అందించే పరిస్థితి ఉండదు. ఫలితంగా ప్రాజెక్టు లక్ష్యానికే గండి కొట్టినట్టు అవుతుంది.