పోల‘వరం’ ఎవరిది? ఆ సెంటిమెంట్ పై విస్తృత చర్చ!
హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజుల్లో వెలువడనున్నాయి.
హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజుల్లో వెలువడనున్నాయి. ఈ వీకెండ్ ముగిసిన రోజు తర్వాత అంటే.. జూన్ 4 (మంగళవారం) ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటల నాటికి ప్రాథమికంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే వీలుందన్న విషయం అందరికి అర్థమయ్యే పరిస్థితి. ఒకవేళ.. రౌండ్ రౌండ్ కు ఫలితాల్లో తేడా వస్తే మాత్రం.. మధ్యాహ్నం 12 గంటల వేళకు అవగాహన ఖాయమని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఎన్నికల పలితాలకు సంబంధించి కొన్ని సెంటిమెంట్లు బలంగా వినిపిస్తుంటాయి. అందులో ఒకటి.. పోల‘వరం’. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు పాగా వేస్తే.. వారికి రాష్ట్రాధికారం ఖాయమన్న మాటను చెబుతుంటారు. అదే విషయాన్ని చరిత్ర చెబుతూ ఉంది.
ఈసారీ అదే సెంటిమెంట్ కంటిన్యూ కావటం ఖాయమంటున్నారు. ఇంతకూ పోలవరంలో ఏ పార్టీ గెలుపు ఖాయమన్నది ఆసక్తికరంగా మారింది. పోలవరం నుంచి కూటమి నుంచి జనసేన పోటీ చేస్తుండటం.. టీడీపీ క్యాడర్ పెద్దగా పని చేయకపోవటం కారణంగా గెలుపుపై అధికార వైసీపీ ధీమాను వ్యక్తం చేస్తుంది. పోల‘వరం’ తమదేనని వైసీపీ నేతలు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. జనసేన గ్లాస్ ను ప్రత్యర్థి వైసీపీ కంటే కూటమిలోని తెలుగు తమ్ముళ్లే పగలకొట్టాలని కంకణం కట్టుకున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.
టికెట్ ను తెలుగుదేశానికి కేటాయించకుండా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఇదే పెద్ద తప్పుగా అంచనా వేస్తున్నారు. ఇంతకూ పోలవరం లెక్కలు ఎలా ఉన్నాయి? గెలుపు మీద వైసీపీ అంత ధీమాను ఎందుకు ప్రదర్శిస్తోందన్న విషయంలోకి వెళితే.. అక్కడ నెలకొన్న రాజకీయ సమీకరణాలే కారణమని చెబుతున్నారు.
వైసీపీ తరఫున తెల్లం రాజ్యలక్ష్మి బరిలో ఉండగా.. కూటమి తరపున జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు పోటీలో ఉన్నారు. టికెట్ ఎంపికలో చోటు చేసుకున్న పరిణామాలు కూటమిలో విభేదాలకు కారణమైందని చెబుతున్నారు. ఈ సీటు నుంచి తెలుగు తమ్ముళ్లు తప్పనిసరిగా పోటీ చేస్తారని భావించినా.. పొత్తుల్లో భాగంగా దీన్ని జనసేనకు కేటాయించటం తెలిసిందే. దీనిపై గుర్రుగా ఉన్న తెలుగుతమ్ముళ్లు జనసేన అభ్యర్థికి కనీస మద్దతు కూడా ఇవ్వలేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో.. ఫలితాల వెల్లడి కంటే ముందే జనసేన ఓటమి ఖాయమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పోలవరంలో 85.98 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు వేసిన వారిలో పురుషుల కంటే 6208 మంది మహిళలు అధికంగా ఓటు వేయటంతో.. తుది ఫలితం మహిళల తీర్పు మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. పోలింగ్ వేళ.. ప్రతి గ్రామంలోనూ మహిళలు పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు బారులు తీరి ఉండటంతో అధికార వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహిళలు తమ పార్టీకి అండగా ఉన్నారని.. రెండోసారి వరుసగా అధికారంలోకి వచ్చేందుకు మహిళలే కారణమవుతారన్న విషయాన్ని వైసీపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తుండటం తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వంలో పోలవరం రూపురేఖలు మారిపోయానని.. ఐదేళ్లలో నియోజకవర్గంలోని ఏడు మండలాలల్లో సుమారు రూ.665.77 కోట్లతో డెవలప్ మెంట్ పనులు జరిగాయని.. టీడీపీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని చెబుతున్నారు. అందుకే.. జగన్ కు అనుకూలంగా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటర్లను తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేసినట్లుగా భావిస్తున్నారు. పోలవరంలో విజయంపై వైసీపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తూ.. విజయం తమదేనని స్పష్టం చేస్తుంటే.. కూటమి నేతలు మాత్రం కామ్ గా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.