పోలవరం విషయంలో క్లారిటీ మిస్ అయిందా ?

పోలవరం జాతీయ ప్రాజెక్ట్. పదేళ్ళుగా అది ఇంకా అలాగే ఉంది. కేంద్రంలో మూడవసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

Update: 2024-07-23 09:50 GMT

పోలవరం జాతీయ ప్రాజెక్ట్. పదేళ్ళుగా అది ఇంకా అలాగే ఉంది. కేంద్రంలో మూడవసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బడ్జెట్ లో పోలవరం ప్రస్తావన కూడా ఉంది. అయితే పోలవరం విషయం చూస్తే గత పదేళ్ళుగా కేంద్రం ఇచ్చినది 15 వేల 147 కోట్ల రూపాయలు.మాత్రమే అన్నది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఇవి కూడా కేంద్రం అధికారికంగా ప్రకటించిన లెక్కలే.

అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖర్చు చేసిన తరువాత కేంద్రం రీ ఎంబర్స్ మెంట్ చేస్తుంది. అయితే 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం అయిన సహకారాలు అందిస్తామని చెప్పారు.

పోలవరానికి పదేళ్ళలో ఇచ్చినదే చూస్తే పాత అంచనాల కంటే నాలుగవ వంతుగా ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక పోలవరం అంచనాలు మళ్లీ పెరిగాయని చెప్పారు. డెబ్బై వేల కోట్ల రూపాయలు దాకా కావచ్చు అని కూడా అన్నట్లుగా చెబుతున్నారు.

మరి పోలవరం తొందరగా పూర్తి చేయాలంటే ప్రతీ ఏటా కనీసం ఇరవై వేల కోట్ల రూపాయలు అయినా కేంద్రం ఉదారంగా ఇవ్వాలి. రాష్ట్రం ముందు ఖర్చు పెట్టి ఆ మీదట రీఇంబర్స్మెంట్ కింద ఇస్తామంటే ఇది తాత్సారం అవుతుంది, నిధులు కూడా సమయానికి రావు అని అంటున్నారు.

పోలవరం విషయంలో అతి పెద్ద ఖర్చు అన్నది నిర్వాసితులకు పునరావాసం మీదనే పెట్టాల్సి ఉంటుంది. అది మొత్తం ఖర్చులో డెబ్బై శాతంగా ఉంటుంది. దాంతో పోలవరం విషయంలో పూర్తి నిధులను తామే ఇస్తామని నిర్వాసితుల ప్యాకేజీతో సహా అని కేంద్రం స్పష్టంగా చెబితే బాగుండేంది. అలా కాకుండా పోలవరం తొందరగా పూర్తికి పూచీకత్తు అని చెబితే అది ఎన్నాళ్ళకు పూర్తి అవుతుంది అన్న సందేహాలు వస్తాయి.

పోలవరం విషయంలో డెడ్ లైన్ పెట్టాలి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఇప్పటి నుంచి కనీసం మూడేళ్లలో అయినా పూర్తి చేయడానికి కేంద్రం పూచీకత్తు పడాలి. అలా కాకుండా పోలవరం పూర్తికి సహకరిస్తామంటే అందులో అస్పష్టతనే కనిపిస్తోంది అని అంటున్నారు. పోలవరం నిజానికి జాతీయ ప్రాజెక్ట్. పదేళ్ల పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అది ఏనాడో పూర్తి కావాల్సి ఉంది.

నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ విషయంలోనే తేడాలు వస్తున్నాయని అంటున్నారు. అంతే కాదు 2014 నాటి అంచనాలకే కట్టుబడి ఉంటామని కేంద్రం ఆలోచిస్తోందని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే తాజాగా మరోసారి అంచనాలు వేసి కేంద్రానికి పంపాలనుకుంటోంది. ఆ మొత్తం ఇబ్బడి ముబ్బడిగా పెరిగేదే తప్ప తగ్గేది కాదు. అందువల్ల పోలవరం విషయంలో ఒక క్లారిటీతో కూడిన ప్రకటన రావాలని అంతా కోరుకుంటున్నారు. పోలవరం పూర్తి అయితే కేంద్ర ఆర్ధిక మంత్రి అన్నట్లు భారత ఆహార భద్రతకు భరోసాగా ఉంటుందన్నది సత్యం.

ఈ విషయంలో అమరావతికి 15 వేల నిధులను ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇస్తామని చెప్పినట్లుగానే స్పష్టంగా ప్రకటన చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తానుగా ఖర్చులు పెట్టి ఆ మీదట కేంద్రం నుంచి రీ ఎంబర్స్ మెంట్ తీసుకోలేదు. రాష్ట్రం ఎంత పెట్టాలనుకున్న అయిదు వేల కోట్లకు మించేది ఉండదు. అలా అనుకుంటే మరో దశాబ్దం గడచినా పోలవరం పూర్తి అయ్యే ప్రసక్తే ఉండదు అంటున్నారు. మరి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు. అపుడే పోలవరం విషయంలో కేంద్రం వరం ఇచ్చినట్లుగా భావించవచ్చు అని కూడా అంటున్నారు.

Tags:    

Similar News