టీడీపీ.. జనసేన... గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్...!

పవన్ చెప్పవచ్చు. నాకు పదవుల మీద మోజు లేదు అనొచ్చు. లేదా ప్రజలు ఇస్తే సీఎం పదవిని తీసుకుంటాను అని కూడా అనవచ్చు

Update: 2023-10-24 15:30 GMT

ఇక మీదట ఏ ఆందోళన చేసినా అది పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా పాకినా రెండు జెండాలు కనిపించాలంతే. ఈ స్ట్రాంగ్ డెసిషన్ ని పవన్ లోకేష్ నాయకత్వంలోని రెండు పార్టీల కో ఆర్డినేషన్ కమిటీ తీసుకుంది. . ఇక మీదట రెండు పార్టీలు కాదు ఒక్క పార్టీయే అన్నట్లుగా దూకుడు చేయాలని నిర్ణయించారని అంటున్నారు.

కామన్ మినిమం ప్రోగ్రాం ని ముందు పెట్టుకుని పనిచేయాలని కూడా డిసైడ్ అయ్యారని అంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ రెండు పార్టీలు నిండు మనసులో పనిచేస్తాయా లేదా అనేది అసలైన చర్చ అని అంటున్నారు. పై స్థాయిలో నేతలు కలిశారు.

చక్కగా జెండాలు పక్క పక్కన పెట్టారు. కానీ దిగువ స్థాయిలో అలా జరుగుతుందా అన్నదే మ్యాటర్ ఇపుడు. ఎందుకంటే రెండు పార్టీల నేతలకు ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా జనసేనలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ రీల్ లైఫ్ లో పవర్ ఫుల్ హీరో. ఆయన రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉండాలని వారు కోరుకుంటారు.

పవన్ చెప్పవచ్చు. నాకు పదవుల మీద మోజు లేదు అనొచ్చు. లేదా ప్రజలు ఇస్తే సీఎం పదవిని తీసుకుంటాను అని కూడా అనవచ్చు. దాంతో పాటు గెలిచిన తరువాత పొత్తు పార్టీలు అన్నీ కలసి సీఎం ఎవరో తేల్చుకుంటాయని కూడా అనవచ్చు.

కానీ కామన్ గా చూసే వారికి సగటు క్యాడర్ కి మాత్రం పవన్ సీఎం కావాలంటే. పవన్ సీఎం అయితేనే వారికి తాము కూడా గెలిచినట్లు. ఆ సీఎం పవన్ అన్న రెండు మాటలను కలపాలని సగటు కార్యకర్త గత దశాబ్ద కాలంగా చూస్తూ వస్తున్నారు. 2014 మార్చి 14న పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తొలి సభ నుంచి కూడా సీఎం సీఎం పవన్ అంటూ గొంతు మండేలా అరుస్తూనే ఉన్నారు.

ఈ మధ్యలో రెండు ఎన్నికలు జరిగాయి. 2024 ఎన్నికలు కచ్చితంగా పవన్ని సీఎం గా చేస్తాయని అంతా భావిస్తున్నారు. దాంతో పాటుగా పవన్ వారాహి రథమెక్కి జనంలోకి రాగానే జన సునామీయే కనిపించింది. దాంతో ఇక ఏముంది పవన్ ముఖ్యమంత్రి అని కన్ ఫర్మ్ అయిపోయారు.

పొత్తుల విషయం కూడా జనసైనికులకు తట్టని విషయం. ఇక ఇపుడు చూస్తే రెండు జెండాలు ఒక్కటి కావాలని అంటున్నారు గ్రామ స్థాయి నుంచే రెండు పార్టీలు ఒక్కటిగా నిలవాలని అంటున్నారు. సీఎం అభ్యర్ధి ఎవరో జనసేన నుంచి అయితే చెప్పడంలేదు కానీ టీడీపీ వారు మాత్రం ధీమాగా చంద్రబాబు మళ్లీ వస్తారు ఆయనే సీఎం అని అంటున్నారు. సహజంగానే టీడీపీ పెద్ద పార్టీ కాబట్టి అదే జరుగుతుంది అన్న ఆలోచన భయాలు జనసేనలో ఉన్నాయి.

పొత్తు పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ కి కూడా సీఎం గా కొంత కాలం ఇచ్చి అధికారంలో వాటాను ఫేవర్స్ కోరుకుంటున్నారు. పవన్ పార్టీకి పునాది ఆయన అభిమానులే. వారే ఇపుడు క్యాడర్ కూడా. వారికి రాజకీయాల్లో లాజిక్కులు మ్యాజిక్కులు అర్ధం కావు, అర్ధం అయినా అవి అనవసరం అని వారు భావిస్తారు. వారి రాజకీయ లక్ష్యం పవన్ సీఎం కావడం. అది జరిగిందా లేదా అన్నదే చూస్తారు.

ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు గెలవాలి. ఆయన సీఎం గా ఉండాలి. ఆ అధికారంలో తామే పూర్తిగా ఉండాలి. పొత్తులో భాగంగా ఎన్ని కొన్ని సీట్లు పోయినా తమకు ఇబ్బందే అన్నది ద్వితీయ తృతీయ శ్రేణుల బాధ ఆవేదన. బెంగ కూడా. ఇక అట్టడుగున ఉన్న క్యాడర్ కి అయితే తామే గెలిచామని అనిపించుకోవాలని ఆరాటం. మాది నాలుగు దశాబ్దాల పార్టీ అని వారికి ఒక నిబ్బరం. పొత్తులతో వేరే పార్టీ కలిస్తేనే గెలుపు అంటే సిసలైన క్యాడర్ కి అది ఇబ్బందికరంగా ఉంటోంది అంటున్నారు. మా చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. అతనికి ఎదురు లేదు అన్నదే కరడు కట్టిన టీడీపీ ఫ్యాన్ మాట.

ఇంకో వైపు వైసీపీ ఒంటరిగా పోటీకి దిగుతోంది. ఇంత సీనియర్ పార్టీగా ఉండి పొత్తులు మద్దతుతో గెలవడం అంటే సగటు టీడీపీ క్యాడర్ కి అది అర్ధం కాని విషయమే అంటున్నారు. ఒంటరిగా పోటీ చేయాలని కూడా అంటున్న వారే ఉన్నారు. ఈ నేపధ్యంలో పసుపు జెండా జనసేన జెండా జట్టుగా కలసికట్టుగా ముందుకు రావాలంటే గ్రౌండ్ లెవెల్ లో చాలా ఫ్యాక్టర్స్ ఇబ్బందిగానే ఉంటాయి. వాటిని ఎంత మేరకు సెట్ చేసుకుంటారు అన్నదే చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News