పథకాలపై ఆశలు.. గెలుపు దూరమా? భారమా?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ, టీడీపీ-జనసేన కూటములకు పథకాలే తురుపు ముక్కలుగా మారుతున్నాయి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ, టీడీపీ-జనసేన కూటములకు పథకాలే తురుపు ముక్కలుగా మారుతున్నాయి. ఒకవైపు అబివృద్ధి నినాదాన్ని వినిపించేందుకు టీడీపీ ప్రయత్నంచేస్తున్నా.. క్షేత్రస్థాయిలో చేపట్టిన పలు సర్వేల్లో పథకాలపై ప్రజామూడ్ తెలుసుకున్న తర్వాత.. చంద్రబాబు సైతం పథకాల బాటలోనే నడుస్తున్నారు. ఇక, ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా తాము పథకాలు ఇస్తున్నామని వైసీపీ అదినేత, సీఎం జగన్ చెబుతున్నారు.
దీంతో పథకాలు..ఏమేరకు పనిచేస్తాయి? వచ్చే ఎన్నికల్లో నిజంగానే పథకాలు ఈ పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయిలో ఫలించనున్నాయా? అనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు.. సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపైనా చర్చ సాగుతోంది. ``జగన్ అనేవాడు లేకపోతే.. ఈ స్థాయిలో మీకు డబ్బులు అందేవా? పథకాలు వచ్చి ఉండేవా? ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా`` అని ఇటీవల అనేక సబల్లోఆయన చెబుతున్న మాట. ఇది
ఈ నేపథ్యంలో పథకాల కేంద్రంగానే వైసీపీ ఎన్నికల వ్యూహానికి తెరదీయనుంది. త్వరలోనే మేనిఫెస్టో కూడా ప్రకటించేందుకు రెడీ అవుతోంది. దీనిలోనూ మరిన్ని పథకాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, టీడీపీ-జనసేన సంయుక్తంగా మేనిఫెస్టోపై కసరత్తును పూర్తి చేసినట్టు సమాచారం. వీరు కూడా.. పథకాలపైనే దృష్టి పెట్టారు. అయితే, వీరు బీజేపీతో జతకట్టాలని భావిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఉచితాలకు వ్యతిరేకం కావడంతో ఎలాంటి పథకాలను వీరు ప్రకటించే అవకాశం ఉందన్నది కూడా ఆసక్తిగా మారింది.
ఇక, గత ఏడాది డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే.. పథకాలను ప్రధానంగా చేసుకు ని మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేశారు. దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు.. తన మానస పుత్రికలని.. అవి తాను లేకపోతే ఆగిపోతాయని ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రతిసభలోనూ ప్రధానంగా వివరించారు. కానీ, ప్రజల తీర్పు భిన్నంగా ఉంది. ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి ప్రజలు జేజేలు కొట్టినట్టు ఎన్నికల అనంతరం నిర్వహించిన సర్వేల్లో స్పష్టంగా తేలింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కూడా.. ఇదే వాదన వినిపిస్తున్న దరిమిలా ఎలాంటి ఫలితం ఉంటుందనేది చూడాలి. ఇక, వ్యక్తి మార్పునకు తెలంగాణ ప్రజలు పెద్దపీట వేశారు. రేవంత్‌ను సీఎంగా ప్రకటించకపో యినప్పటికీ.. ఆయన వైపే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపారు. సో.. ఉచితాలకు ప్రజలు ఓటేస్తారా? లేదా? అనేది తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైన నేపథ్యంలో ఏపీ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.