రాజకీయ మొనగాడు రేవంత్ రెడ్డి ...

కేవలం రెండే రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి పదవిని అందుకున్న బహు మొనగాడు రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ చిత్ర విచిత్రంగా ఉంటుంది.

Update: 2023-12-05 17:42 GMT

రాజకీయాల్లో కొనసాగాలంటే గుండె బలం చాలా కావాలి. అవి పుష్కలంగా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన ఎపుడూ కొండనే ఢీ కొడతారు. ఆ తెగువకు దూకుడుకు ఫలితం కచ్చితంగా వస్తుంది. కేవలం రెండే రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి పదవిని అందుకున్న బహు మొనగాడు రేవంత్ రెడ్డి పొలిటికల్ లైఫ్ చిత్ర విచిత్రంగా ఉంటుంది.

ఆయన హైదరాబాద్ లో డిగ్రీ దాకా చదివారు. ఆ టైం లోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు కనిపించాయి. ఏబీవీపీలో చేరి విద్యార్ధి ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. ఆ తరువాత ఆయన ఆర్ఎస్ఎస్ పత్రిక అయిన జాగృతిలో కొంతకాలం పాత్రికేయుడిగా పనిచేశారు. ఆయనలో రాజకీయం కుదురుగా ఉండనీయలేదు.

అందుకే ఆయన 2000 నాటికి తన పంధాను మార్చుకున్నారు. ఆయన తొలుత టీఆర్ఎస్ లో చేరి అందులో కొంతకాలం కొనసాగారు. ఆ తరువా 2006లో జెడ్పీటీసీ మెంబర్ గా గెలిచారు. 2007లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచారు. అనంతరం టీడీపీలో చేరి 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు.

అదే సీటు నుంచి 2014లో మరోసారి టీడీపీ నుంచి గెలిచారు. ఆ తరువాత తెలుగుదేశం తెలంగాణా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసారు. 2017 నాటికి ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చింది. ఆ పదవితోనే 2018లో ఆయన తెలంగాణా ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఓడింది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి కూడా ఓడారు.

అయితే ఆ మరుసటి ఏడాది 2018లో మల్కాజ్ గిరి లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ మీదట ఇక 2021 నాటికి ఆయనను తెలంగాణా పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ నియమించింది. దాంతో కొత్త ఉత్సాహంతో రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. గట్టిగా రెండున్నరేళ్ళు ఆయన కష్టపడి కాంగ్రెస్ ని ఫోర్ ఫ్రంట్ లోకి తీసుకుని వచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఓడించలేరు అన్న అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఇపుడు ఏకంగా తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

ఇక తెలంగాణా ఏర్పడ్డాక బీఆర్ ఎస్ నుంచే కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారు. ఆయన తరువాత కాంగ్రెస్ నుంచి తెలంగాణా రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రికార్డు రేవంత్ రెడ్డిది. అలా బీఆర్ఎస్ యేతర సీఎం గా పేరు గడించారు. అంతే కాదు పీసీసీ చీఫ్ అయిన వారు సీఎం కాలేరు అన్న కాంగ్రెస్ సంప్రదాయాన్ని ఆయన మార్చేశారు. తాను సీఎం గా ఎంపిక అయి సరికొత్త చరిత్ర సృష్టించారు. దటీజ్ రేవంత్ రెడ్డి అనిపించారు.

Tags:    

Similar News