బొప్పూడి సభలో చిత్ర విచిత్రాలు.. !
+ దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏర్పాటు చేసిన సభలో మైక్ సిస్టమ్ పదే పదే ఆగిపోయింది.
టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభ.. ప్రజాగళంను ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరి పేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించారు. అయితే.. ఈ సభలో కొన్ని చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
+ దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏర్పాటు చేసిన సభలో మైక్ సిస్టమ్ పదే పదే ఆగిపోయింది. ప్రధానంగా మాజీ సీఎం చంద్రబాబు ప్రసంగించినప్పుడు రెండు సార్లు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో 6 సార్లు మైక్ సిస్టమ్ మూగబోయింది. దీంతో ప్రధాని మంత్రి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
+ పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు.. కరెంటు కోసం ఏర్పాటు చేసిన పోల్స్ ఎక్కి హడావుడి చేశారు. సభలో పాల్గొన్న కొందరు.. నేతలను చూసేందుకు లైటింగ్ పోల్స్ ఎక్కారు. దీన్ని గమనించిన ప్రధాని మోడీ వారిని దిగాలని మైక్ లో విజ్ఞప్తి చేశారు. 'మీ ప్రాణాలు ఎంతో విలువైనవి. కరెంట్ తీగలకు దూరంగా ఉండాలి' అని కోరారు. పోలీసులు కల్పించుకుని వారిని కిందకు దించాలని సూచించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు లైటింగ్ పోల్స్ ఎక్కిన వారిని కిందకు దించారు.
+ ప్రధాన మంత్రి మోడీ హిందీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించే విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు .. దగ్గుబాటి పురందేశ్వరి అనేక సందర్భాల్లో తన సొంత వ్యాఖ్యానం జోడించారు. ప్రధాని చెప్పని విషయాలను కూడా ఆమె చెప్పారు. దీంతో హిందీ తెలిసిన వారు నోరు వెళ్లబెట్టారు. అదేసమయంలో ప్రధాని మోడీ చెప్పిన మాటలకు... ఆమె అనువాదానికి అనేక సందర్భాల్లో లింకు తెగిపోయింది. ``ప్రజాస్వామ్య ఎన్నికల పండుగను ఆహ్వానిస్తూ.. మీ మొబైల్ ఫోన్ల టార్చ్‌లను వెలిగించండి`` అని ప్రధాని మోడీ హిందీలో చెబితే.. పురందేశ్వరి.. ``ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసుకునేందుకు ఆహ్వానించండి. ఈ మేరకు మీరు మొబైల్ ఫోన్లలో టార్చ్ వెలిగించండి`` అని తప్పుడు అనువాదం చేశారు.
+ ప్రధాని ప్రసంగంలో కీలకమైన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కుగర్మాగారం.. వెనుక బడిన జిల్లాలు, జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో దాడి ఉంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఆయన పెద్దగా ఈ విషయాలను పట్టించుకోలేదు.అసలు పెద్దగా స్పందించనూ లేదు. జగన్ సర్కారుపై మొక్కుబడి విమర్శలు చేయడం గమనార్హం.