''నా భార్య పుట్టిన రోజు యాదృచ్ఛికం.. పోలీసులు నిజం''

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌న కుటుంబంపై కొంద‌రు కావాల‌నే బుర‌ద జ‌ల్లుతున్నార‌ని తెలిపారు

Update: 2024-08-29 10:37 GMT

''నా భార్య పుట్టిన రోజు యాదృచ్ఛికంగా జ‌రిగింది. అక్క‌డికి పోలీసులు రావ‌డం నిజంగానే జ‌రిగింది!'' అని టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి. చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే ప్ర‌త్తిపాటి పుల్లారావు వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే.. ఈ వివ‌ర‌ణ‌లో ఆయ‌న పొస‌గ‌ని కామెంట్లు చేయ‌డం మొత్తం వ్య‌వ‌హారాన్ని మ‌రింత వివాదం చేసింది. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌న కుటుంబంపై కొంద‌రు కావాల‌నే బుర‌ద జ‌ల్లుతున్నార‌ని తెలిపారు. వీరిలో త‌మ వాళ్లే ఉన్నార‌న్న సందేహాలు వ్య‌క్తమ‌వుతున్నాయని చెప్పారు.

త‌న భార్య పుట్టిన రోజుయాదృచ్ఛికంగా జ‌రిగింద‌ని ప్ర‌త్తిపాటి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. యాదృచ్ఛి కంగా పుట్టిన రోజు ఎవ‌రూ చేసుకోరు. కానీ, ప్ర‌త్తిపాటిఇలా ఎందుకు అన్నారో ఆయ‌న‌కే తెలియాలి. లేదా ఒక త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు ఇలా వ్యాఖ్యానించి ఉండాలి. ఇక‌, మ‌రో విష‌యంలోనూ .. ప్ర‌త్తిపాటి .. త‌ప్ప‌ట‌డుగు వేశారు. పోలీసుల‌ను తానే త‌న ఇంటికి ఆహ్వానించాన‌ని చెప్పారు. దీనికి కార‌ణం కూడా చెప్పారు. చిల‌క‌లూరిపేట‌లో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు పెరిగిపోయాయ‌ని.. అందుకే ఆ స‌మ‌స్య ప‌రిష్కారానికి తాను న‌డుంబిగించాన‌ని అన్నారు.

ఈ క్ర‌మంలో పోలీసుల‌ను తానే ఇంటికి పిలిచి.. స‌మీక్షించాల‌ని నిర్ణ‌యించాన‌ని.. అందుకే పోలీసులు త‌న ఇంటికి వ‌చ్చార‌ని వివ‌రించారు. అయితే.. ఆయ‌న మ‌రో త‌ప్పు చేశారు. ఎందుకంటే.. చిల‌క‌లూరి పేట మ‌హా ప‌ట్ట‌ణం కాదు. అక్క‌డ పెద్ద‌గా ట్రాఫిక్ లేదు. ఒక‌వేళ ఉన్న‌ద‌నే అనుకున్నా.. చిల‌క‌లూరి పేట ట్రాఫిక్ పోలీసుల‌ను మాత్ర‌మే ఆయ‌నపిలిచి ఉండాల్సింది. అది కూడా .. ఇంట్లో స‌మీక్ష‌లు చేయ‌డం అనే సంస్కృతి లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఎమ్మెల్యేలు.. ఇళ్ల‌లో స‌మీక్ష‌లు చేయ‌లేదు. ఇదొక త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌.

మ‌రొక‌టేంటంటే.. ప్ర‌త్తిపాటి పుల్లారావు స‌తీమ‌ణి వెంకాయమ్మ కేక్ క‌ట్ చేస్తున్న స‌మ‌యంలో ఉన్న పోలీ సులు.. లా అండ్ ఆర్డ‌ర్‌, క్రైమ్‌, ఎక్సైజ్ పోలీసులు. వీరిలో అంద‌రూ ఎస్సైలు, సీఐలే. ఒకే ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు. మ‌రి .. పుల్లారావు చెబుతున్న వివ‌ర‌ణ ఏమేర‌కు స‌మంజ‌సంగా ఉందో ఆయ‌నే అర్ధం చేసుకోవా లి. ఇక‌, తాము ట్రాన్స్‌ఫ‌ర్ల‌లో జోక్యం చేసుకోలేదని.. త‌మ కుటుంబం అలాంటిది కాద‌ని అన్నారు. ఇప్పుడు ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండు మాసాలే అయిన నేప‌థ్యంలో ఆయ‌న జోక్యం చేసుకుని ఉండ‌క‌పోవ‌చ్చు.

కానీ, గ‌తంలో జ‌రిగిన అనేక రెవెన్యూ.. పోలీసు బ‌దిలీల్లో వెంకాయ‌మ్మ గ‌ల్లా పెట్టేశార‌న్న విమ‌ర్శ‌లు.. టీడీ పీ నేత‌లే రోడ్డుమీద‌కు వ‌చ్చి మ‌రీ చెప్పుకొచ్చారు. అందుకే..మంత్రి ప‌ద‌విని మార్చేశారు. ఇప్పుడు మంత్రి పీఠం ద‌క్క‌క‌పోవ‌డానికి కూడా అప్ప‌టి ఆరోప‌ణ‌లే కార‌ణం. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు తాజా గా జ‌రిగిన కేబినెట్ స‌మావేశంలో ప‌రోక్షంగా చెప్పారు. ``అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న వారిని ఇప్పుడు ప‌క్క‌న పెట్టా.. అయినా తీరు మార‌డం లేదు`` అని ఎవ‌రిని ఉద్దేశించి బాబు అన్నారో.. టీడీపీ నాయ‌కుల‌కు.. పుల్లారావుకు తెలియందికాదు. కానీ, ఒక త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే క్ర‌మంలో త‌ప్పుల‌పై త‌ప్పులు చేయ‌డమే ఆశ్చ‌ర్యంగా ఉంది.

Tags:    

Similar News