అమరావతిలో మరో కుంభకోణం.. మాజీ మంత్రి కుమారుడికి రిమాండ్‌!

ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్‌ఐఆర్‌ లు దాఖలు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు

Update: 2024-03-01 07:24 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకుని జీఎస్టీ ఎగవేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడిని విజయవాడలో న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో శరత్‌ ను విజయవాడ సబ్‌ జైలుకు తరలించారు.

కాగా శరత్‌ రిమాండ్‌ పై రెండు గంటలపాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్‌ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి శరత్‌ కు 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ తీర్పు ఇచ్చారు. శరత్‌ తరపున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇదే తరహా కేసును తెలంగాణలో కూడా నమోదు చేసినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఒకే తరహా నేరంపై రెండు ఎఫ్‌ఐఆర్‌ లు దాఖలు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు.

కాగా, జీఎస్టీ ఎగవేత కేసులో ఫిబ్రవరి 29 రాత్రి శరత్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ మాచవరం పోలీసుస్టేషన్‌ లో అతడిపై కేసు నమోదు చేశారు. ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు. నిధులు మళ్లించి పన్ను ఎగవేశారనే ఆరోపణలపై శరత్‌ తో సహా మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో పుల్లారావు భార్య, బావమరిది కూడా ఉన్నారు.

కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం రాజధానిలో మౌలిక సదుపాయాల కాంట్రాక్టుల పేరిట రూ.66.03 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్తిపాటి కుటుంబానికి చెందిన అవెక్సా కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాంట్రాక్టులు, సబ్‌ కాంట్రాక్టుల పేరుతో బోగస్‌ ఇన్వాయిస్‌లు సమర్పించి నిధులు కొల్లగొట్టి.. షెల్‌ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు చెబుతున్నారు.

కేంద్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ), రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీ డీఆర్‌ఐ) సోదాల్లో ఈ వ్యవహారం మొత్తం బయటకొచ్చిందని సమాచారం. ప్రత్తిపాటి కంపెనీ కేంద్ర జీఎస్టీ విభాగాన్ని బురిడీ కొట్టించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు గండి కొట్టిందని అంటున్నారు.

దీంతో డీఆర్‌ఐ ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి అవెక్సా కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 467, 471, 477(ఎ), 120 (బి) రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించారు.

Tags:    

Similar News