ఎంత పులివెందుల బస్టాండ్ అయితే మాత్రం ఇలా అవార్డు ఇచ్చేయటమా!

తాజాగా పులివెందులలోని వైఎస్సార్ బస్ టెర్మినల్ కు పర్యాటక శాఖ ఉత్తమ పర్యాటక ఫ్రెండ్లీ బస్టాండ్ అవార్డును ప్రకటించారు.

Update: 2023-09-28 04:30 GMT

పులివెందుల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం మిగిలిన వాటితో పోలిస్తే ఎంత ఎక్కువ ప్రయారిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కాబోలు.. అధికారులు సైతం తమ విధేయతను చాటిచెప్పుకోవటానికి.. ముఖ్యమంత్రిని ఆకర్షించేందుకు వీలుగా తీసుకున్న నిర్ణయంపై వ్యంగ్యస్త్రాల్ని సంధిస్తున్నారు.

తాజాగా పులివెందులలోని వైఎస్సార్ బస్ టెర్మినల్ కు పర్యాటక శాఖ ఉత్తమ పర్యాటక ఫ్రెండ్లీ బస్టాండ్ అవార్డును ప్రకటించారు. ఈ పురస్కారం ఎందుకు ఇచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నగామారింది. పులివెందులకు పర్యాటకులకు ఎలాంటి లింకు లేదు.

ఏపీలోని చాలా పుణ్యక్షేత్రాలు.. పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు ఉన్నప్పటికీ.. వాటికి దక్కని అవార్డు.. ఎలాంటి పర్యాటక ప్రాంతం లేని పులివెందుల బస్టాండ్ కు ఎలా ఇస్తారన్న ప్రశ్నను అడుగుతున్నారు.

పులివెందుల పట్టణంలో రూ.22.5 కోట్ల ఖర్చుతో కొత్త బస్ టెర్మినల్ ను నిర్మించారు. గత ఏడాది డిసెంబరులో ఈ బస్టాండ్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇదంతా బాగానే ఉన్నా.. నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగా వర్షం వచ్చిన ప్రతిసారీ పైకప్పు నుంచి నీరు కారుతున్న పరిస్థితి. ఈ నెలలో కురిసిన వర్షాల వేళలోనూ.. లీకులు దర్శనమిచ్చాయి. వర్షం పడితే చాలు.. వాన నీళ్లు పడటంతో.. వాటిని బక్కెట్లు ఏర్పాటు చేయటం ఒక రివాజుగా మారింది.

దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో కొంత రిపేర్లు చేసినప్పటికి.. ఏవో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. అలాంటి బస్టాండ్ లో పర్యాటక ఫ్రెండ్లీ అవార్డు ఎలా ఇస్తారన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News