పులివెందుల, గజ్వేల్, కుప్పంలా.. ఆ సీఎం నియోజకవర్గం ఖాయం
అలాంటివారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ఏదైనా సరే డెవలప్ మెంట్ కు చాలా అవకాశం ఉంటుంది.
అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే భారత దేశంలో వేలాది స్థానాలు ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే 294 సీట్లన్నాయి. వీటిలో ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉంటారు. మొత్తంగా చూస్తే 40 మంది పైగా మంత్రులూ ఉంటారు. అయితే, రెండు రాష్ట్రాలలోనూ ఇద్దరికే సీఎంలు అయ్యే అవకాశం దక్కుతుంది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఒక్కరికే ఆ మహద్భాగ్యం దక్కుతుంది. కాగా, రాష్టానికి అధిపతి సీఎం. అలాంటివారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ఏదైనా సరే డెవలప్ మెంట్ కు చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి అవకాశమే ఓ నియోజకవర్గానికి దక్కింది.
గడా, కడా..
తెలుగు రాష్ట్రాల సీఎంలుగా అత్యంత ప్రభావం చూపినవారిలో ముందుగా చెప్పుకొనేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు. 1995 నుంచి 2009 వరకు వీరిద్దరి మధ్యనే సీఎం కుర్చీ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనను గెలిపించి కుప్పం డెవలప్ మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. అక్కడ ద్రవిడ యూనివర్శిటీ ఏర్పాటు చేయడమే కాకుండా.. కుప్పం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఇక వైఎస్ ఆర్ కు పులివెందుల అంటే మహా ప్రాణం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సీఎం అయిన ఆయన పులివెందులను పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా మార్చారు. డెవలప్ మెంట్ కు పెద్దపీట వేసి కుప్పం తరహాలోనే ప్రత్యేక అథారిటీని నియమించారు. మరోవైపు తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ తనను గెలిపించిన గజ్వేల్ ను ఎక్కడికో తీసుకెళ్లారు. అప్పటివరకు ఓ సాధారణ నియోజకవర్గంగా ఉన్న గజ్వేల్ ఇప్పుడు అత్యంత డెవలప్ అయింది. దీనికోసం గడా (గజ్వేల్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ)ని నెలకొల్పారు. ఫలితంగా గజ్వేల్ రూపురేఖలే మారిపోయాయి.
కొడంగల్ కూ మహర్దశ
తెలంగాణలో ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మారుమాట లేకుండా ముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది. దీంతో ఆయన గెలిచిన సీటు కొడంగల్ కు మహర్దశ పట్టనున్నట్లు స్పష్టమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం కొడంగల్. అలాంటి సీటులో 2009, 2014లో గెలుపొందారు రేవంత్ రెడ్డి. 2018లో ఓడినా మల్కాజిగిరి ఎంపీగా నెగ్గారు. ఇటీవలి ఎన్నికల్లో కొడంగల్ లో విజయదుందుభి మోగించారు. ప్రచారం సమయంలోనే కొడంగల్ బిడ్డకు పెద్ద పదవి రానుందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. అనుకున్నట్లుగానే సీఎం అయిన ఆయన కొడంగల్ డెవలప్ మెంట్ కోసం కుడా (కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు. ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించారు.
తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ..
రాష్ట్రంలో ఏర్పాటయ్యే తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో నెలకొల్పనున్నారు. ఈ నియోజకవర్గంలోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ కాలేజీని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీగా మార్చనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం(2024-25) నుంచే తరగతులను ప్రారంభించనున్నారు. బీటెక్ సీఎస్‌ఈ, సీఎస్‌ఈ (ఏఐ అండ్ ఎంఎల్), సీఎస్‌ఈ (డేటా సైన్స్) కోర్సులు ఉంటాయి. కాగా, ఇంజనీరింగ్ విద్య మొదలైనప్పటినుంచి ప్రైవేటు కాలేజీలదే హవా. యూనివర్శిటీల్లో ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నా అవన్నీ క్యాంపస్ లో అంతర్భాగమే. జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్శిటీల పరిధిలో ఈ కాలేజీలున్నాయి. ప్రభుత్వ రంగంలో ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయలేదు. ఇలాంటి సమయంలో తొలిసారి కోస్గి ఇంజినీరింగ్ కళాశాల రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేయనుంది. మున్ముందు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు కొడంగల్ నియోజకవర్గంలో మరిన్ని జరుగుతాయనడంలో సందేహం లేదు. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇలా ప్రగతి బాట పట్టడం అందరికీ ఆనందమే కదా..?