పురందేశ్వరిని ఇరికించేశారా? బీజేపీ నేతల టాక్
''మీరేం చేస్తున్నారు'' అంటూ నిత్యం పురందేశ్వరికి కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి ఫోన్లు, సమాచార సేకరణ వంటివి సాగుతున్నాయి.
నేనే ఆ పార్టీ సైన్యం! అన్నట్టుగా ఉంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పరిస్థితి! ఎవరు ఔనన్నా కాదన్నా.. ఆమెకు సహ కరించేవారు.. సమయస్ఫూర్తిగా ముందుకు నడిచేవారు.. కనిపించడం లేదు. ఏకంగా.. ఎవరికివారు రాజకీయాలు చేసు కుంటున్నారు. ఏదో ఆమె కార్యక్రమాలకు వస్తున్నారంటే వస్తున్నారు .. తప్ప ఏ నాయకుడు కూడా మనస్ఫూర్తిగా ముందుకు రావడం లేదు. దీంతో పురందేశ్వరి తీవ్రస్థాయిలో విసిగిపోతున్నారనే గుసగుస పార్టీలో జోరుగా సాగుతోంది. పార్టీని గట్టెక్కించా లనే తపన ఒకవైపు ఉన్నా, నాయకులు క్షేత్రస్తాయిలో సహకరించడం లేదన్న ఆవేదనా ఆమెను కలిచి వేస్తోంది.
ఇదిలావుంటే.. ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణలో జనసేనతో కటీఫ్ చేసుకుంటున్నట్టు అక్కడి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తుకు రెడీగా లేమని.. అయిందేదో అయిపోయిందని అన్నారు. ఈ పరిణామం.. ఏపీపైనా ప్రభావం చూపిస్తోంది. దీంతో ఏపీలో అయినా.. జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా? ఉండ దా? అనే ప్రశ్న పురందేశ్వరిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనిపైనే ఆమె వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. మరో వైపు.. రాష్ట్రంలో బీజేపీ ప్రాతినిథ్యాన్ని పెంచాలని పైనుంచి పెద్ద ఎత్తున వత్తిడి కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
``మీరేం చేస్తున్నారు`` అంటూ నిత్యం పురందేశ్వరికి కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి ఫోన్లు, సమాచార సేకరణ వంటివి సాగుతున్నాయి. దీంతో ఆమె వీటికి సమాధానం చెప్పుకోలేక సతమతం అవుతున్నారు. మరోవైపు.. ఉత్తరాంధ్రలో నిన్న మొన్నటి వరకు బాధ్యతలు తీసుకున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజులు.. పూర్తిగా అస్త్ర సన్యాసం చేసేశారు. అసలు విష్ణు.. బీజేపీ కార్యక్రమాల కంటే కూడా.. ఇతర పార్టీల కార్యక్రమాలకు వెళ్తున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనిని కూడా ప్రశ్నించలేని పరిస్థితిలో పురందేశ్వరి ఉన్నారని మరో టాక్.
ఇక, రాయలసీమలోనూ బీజేపీ పరిస్థితి ఇలానే ఉంది. తిరుపతి జిల్లాలో భానుప్రకాష్ రెడ్డి.. తన మానాన తను కార్యక్రమాలు చేస్తున్నారట. దీనిపై పార్టీ అధ్యక్షురాలికి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇక, కర్నూలులోనూ ఇదే తరహా నాయకు ల వ్యవహారం.. పురందేశ్వరికి తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఈ పరిణామాలతో ఆమె విసిగి పోతున్నారని.. ఎన్నికలకు ముందు తనను బలి చేసేందుకే ఈ పోస్టు ఇచ్చారా? అంటూ.. అసహనం వ్యక్తం చేస్తున్నారని, కలిసి వచ్చే నాయకులు లేక.. కనీసం తనకు సహకరించే వారు కూడా లేక సతమతం అవుతున్నారనేది బహిరంగంగా బీజేపీ నేతల మధ్యే జరుగుతున్న చర్చ..!