ఆ విషయంలో పురందేశ్వరి భయపడ్డారా?
ఈ అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఖండించారు. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఖండించారు. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. చంద్రబాబుకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నోటీసులు ఇస్తే పురందేశ్వరి ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండి కనీసం స్పందించలేదని.. చంద్రబాబును అరెస్టు చేస్తే మాత్రమే అది పాపమన్నట్టు ఖండించారని వైసీపీ నేతలు ఆమెపై విరుచుకుపడ్డారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుతోపాటు పురందేశ్వరి కూడా కీలకపాత్ర పోషించారని వైసీపీ నేతలు ఆరోపించారు. పురందేశ్వరి బీజేపీ నేతగా ఉన్నారా లేక టీడీపీ నేతగా ఉన్నారా అని వైసీపీ నేతలు గట్టి విమర్శలే చేశారు. మరోవైపు ఏపీ బీజేపీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో పురందేశ్వరి ఇరుకునపడ్డారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బందుకు జనసేన, సీపీఐ కూడా మద్దతు ప్రకటించాయి. అయితే బీజేపీ మాత్రం మద్దతు ప్రకటించలేదు. తాము బందుకు మద్దతు ఇవ్వడం లేదని పురందేశ్వరి ప్రకటన చేశారు.
అయితే బీజేపీ.. టీడీపీ బందుకు మద్దతు ఇస్తున్నట్టు ఒక లెటర్ వైరల్ గా మారింది. ఆ లెటర్ పై పురందేశ్వరి సంతకం ఉండటంతో ఆమె స్పందించారు. అది ఫేక్ లెటర్ అని.. దాన్ని సృష్టించినవారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తామన్నారు.
కాగా తన మరిది చంద్రబాబు అరెస్టును ఖండించిన పురందేశ్వరి.. టీడీపీ ఇచ్చిన బందుకు మాత్రం మద్దతు ప్రకటించకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
చంద్రబాబు అరెస్టును ఎవరినడిగి ఖండించారని బీజేపీ పెద్దల నుంచి ఆమెకు అక్షింతలు పడ్డట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీలోని కొన్ని వర్గాలు కూడా పురందేశ్వరి బీజేపీ నేతగా కాకుండా టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. అందుకే చంద్రబాబు విషయంలో ఆయనకు మద్దతుగా అత్యుత్సాహం చూపుతున్నారని పేర్కొన్నట్టు టాక్ నడుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసే యోచనే లేదని ఇప్పటికే పలుమార్లు బీజేపీ ప్రకటించిందని.. అలాంటప్పుడు చంద్రబాబు విషయంలో అంత ఉత్సాహం చూపుతూ ఆయన అరెస్టును ఖండించాల్సిన అవసరం ఏమొచ్చిందని పురందేశ్వరిని బీజేపీ నేతలు నిలదీసినట్టు చెబుతున్నారు.
తనపై ఇంటా బయటా కురుస్తున్న విమర్శల నేపథ్యంలోనే టీడీపీ ప్రకటించిన రాష్ట్ర బందుకు పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మద్దతు ప్రకటించలేదని చెబుతున్నారు. విమర్శలకు జడిసే ఆమె వెనుకంజ వేశారని అంటున్నారు.