బీజేపీ నిలదీస్తూంటే చంద్రబాబు మీద కేసులు....చిన్నమ్మకు అర్ధం కాని వైసీపీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీకి చంద్రబాబుకు మేలు చేస్తున్నారని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీకి చంద్రబాబుకు మేలు చేస్తున్నారని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. కానీ ఆమె చేటు చేస్తున్నారు అని అంటున్నారు. అదెలా అంటే వైసీపీ ప్రభుత్వం మీద ఆమె తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అక్రమ మద్యం విషయంలో వేల కోట్ల ఆదాయం ఖజానాకు రాకుండా అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తోందని పురంధేశ్వరి ఆరోపించారు.
ఆ వెంటనే ఆమె కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి కలసి విచారణను కోరారు. అయితే పురంధేశ్వరి ఇలా విమర్శించారో లేదో అలా చంద్రబాబు మీద లిక్కర్ స్కాం లో ఏ3గా పేర్కొంటూ కేసు పెట్టారు. ఇక ఇసుక కుంభకోణం అంటూ పురంధేశ్వరి మరో విమర్శ చేశారు. వెంటనే చంద్రబాబు మీద ఇసుక కేసు కూడా పెట్టారు.
ఇలా వరసబెట్టి బాబు మీద అధికార పార్టీ కేసులు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో టీడీపీ నేతలు బీజేపీ ప్రెసిడెంట్ డిమాండ్ తో తమ పార్టీకి బ్యాండ్ పడుతుందని అంటున్నారు. దీని మీదనే ఇపుడు పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. తాను ప్రస్తుత ప్రభుత్వం మద్యం ఇసుక కుంభకోణాలకు పాల్పడింది అని విమర్శిస్తూంటే తనకు జవాబు చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెట్టడమేంటి అని మండిపడ్డారు.
ఇది పూర్తిగా నియంతృత్వం తప్ప మరొకటి కానే కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఆమె పేర్కొన్నారు. తాము అడిగిన వాటికి జవాబు చెప్పే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే కాదు వేరే వారి మీద కేసులు పెట్టడమేంటని నిలదీశారు. రాష్ట్రంలో ఇసుక మద్యం మాఫీల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ఇతరుల మీద కేసులు అని ఆమె పేరు చెప్పకపోయినా టీడీపీ మీద చంద్రబాబు మీద కేసులను ప్రభుత్వం పెట్టడం మీదనే హాట్ కామెంట్స్ చేశారని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఈ రెండు విషయంలో అక్రమాలు జరిగాయని ప్రచారం సాగింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళ కాలం అయింది ఈ మధ్యలో ఎందుకు పెట్టలేదు అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఇపుడు బీజేపీ అడగడంతోనే చంద్రబాబు మీద కేసులు పెడుతున్నారంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తోందా అన్నదే చర్చగా ఉంది.
ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీతో పొత్తు అంశం కేంద్ర బీజేపీ పెద్దలు తేల్చాల్సిన అంశమని పురంధేశ్వరి అన్నారు పొత్తులు అన్నవి ఎపుడూ ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు మాత్రమే కుదురుతాయని అన్నారు. ఆ సమాయనికి తగినట్లుగా పొత్తులు ఉంటాయని ఆమె చెప్పారు. ఏపీలో ప్రస్తుతానికి మాత్రం తమ పార్టీతో జనసేన పొత్తులో ఉందని ఆమె అన్నారు.
ఇదిలా ఉంటే టీడీపీతో పొత్తుల మీద బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పురంధేశ్వరి ఆసక్తిగా ఉందని అంటున్నారు. అదే విధంగా ఆమె చంద్రబాబు అరెస్ట్ ని ఖండించారు. బెయిల్ వస్తే స్వాగతించారు. మీడియాతో తాజాగా మాట్లాడుతూ బాబు అరెస్ట్ ని ఫస్ట్ ఖండించింది తామే ని కూడా క్రెడిట్ ని క్లెయిం చేసుకుంటున్నారు. ఇంతకీ ఏపీలో బీజేపీతో కలసి నడవాలని టీడీపీకి ఉందా అన్నదే ప్రశ్న. పొత్తుల విషయంలో పురంధేశ్వరి తన పరిధిలో చేయాల్సినది అంతా చేస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.