రత్నభండాగారం ఎఫెక్ట్: పాములు పట్టేవారికి 'పూరీ' ఆహ్వానం!
సర్కారు దగ్గర ఉన్న తాళం చెవి పోయిందని..గత సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని ఆల యంలో ఈ నెల 14న అత్యంత రహస్యమైన.. రత్నభండాగారాన్ని తెరవనున్నారు. దీనిని 1978లో చివరి సారి తెరిచారు. ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరూ దాని జోలికి పోలేదు. అయితే.. ఆ మధ్య ఓ 20 ఏళ్ల కిందట ప్రయత్నించారని.. కానీ, రత్నభండాగారానికి ఉన్న సర్ప భద్రత కారణంగా.. ముందుకు అడుగులు వేయలేకపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీంతో అసలు ఈ రత్నభండాగారం జోలికి ఎవరూ పోలేదు. అయితే.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం దక్కించుకుంటే.. ఖచ్చితంగా రత్నభండాగారం తెరిపిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. ఇది బాగా వర్కవుట్ అయింది. ఈ నేపథ్యంలో రత్న భండాగారం రహస్యంపై కమిటీ వేసి.. నివేదికలు తెప్పించుకున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఈ భండాగారాన్ని తెరిచేందుకు రెండు తాళం చెవులు ఉన్నాయి. ఒకటి ఆలయం వద్ద ఉంటే.. రెండోది సర్కారు దగ్గర ఉంటుంది.
సర్కారు దగ్గర ఉన్న తాళం చెవి పోయిందని..గత సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. అందుకే తాము భండాగారాన్ని తెరవలేక పోతున్నామన్నారు. అయితే.. ఇప్పుడు ఆ తాళం చెవి దొరికినా.. దొరకకపోయినా.. తెరిచి తీరాల్సిందేనని బీజేపీ నిర్ణయించుకుంది. నివేదిక కూడా ఇదే చెప్పింది. దీంతో ఈ నెల 14 ఆదివా రం.. రత్న భండాగారాన్ని తెరిచేందుకు అధికారులు, ప్రభుత్వం కూడా రెడీ అయింది. ఇంత వరకు బాగా నే ఉంది. కానీ, ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది.
రత్నభండాగారాన్ని తెరిస్తే.. రాష్ట్రానికి అరిష్టమని కొందరు సిద్ధాంతులు చెబుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ కూడా సాగుతోంది. ఇదిలావుంటే.. రత్న భండాగారాన్ని పెద్ద పెద్ద విష సర్పాలు కాపలా కాస్తున్నాయని.. కాబట్టి తెరిచేందుకు అవకాశం తక్కువగా ఉందని ఐఏఎస్ అదికారులు కూడా సర్కారుకు రిపోర్టులు ఇచ్చారు. కొందరైతే.. విషసర్పాల గాలి ద్వారా కూడా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
దీంతో ప్రభుత్వం పాములు పట్టే వారు కావాలంటూ.. ప్రకటనలు జారీ చేసింది. అంతేకాదు.. వైద్య బృం దాలను కూడా నియమించింది. మరోవైపు.. పూరి శంకరాచార్య మాత్రం రత్నభండాగారాన్ని తెరవడం అరిష్టమని.. రాష్ట్రంలో విపత్తులు సంభవిస్తాయని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోమాలు.. పూజలు కూడా జరుగుతున్నాయి. ఇదిలావుంటే.. రత్నభండాగారం తెరిస్తే.. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అంతర్జాతీయ నిపుణులు ఒడిశాకు చేరుకున్నారు.