జగన్ కు ట్రిపుల్ ఆర్ వెల్ కమ్.. షర్మిల కోరికపై ఇంట్రస్ట్రింగ్ కామెంట్స్!
దీనిపై స్పందించిన రఘురామ... షర్మిల మాట్లాడినదానిలో న్యాయముందని.. అయితే.. వైసీపీ మరోసారి ఎన్నికలకు వెళ్తే.. 11 సీట్లు కాస్తా ఒక్క సీటు అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికవ్వడానికి ముందు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ జగన్ గైర్హాజరు.. ప్రతిపక్ష హోదా.. రాజీనామా చేయాలంటున్న షర్మిల కోరిక.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి ల విషయాలను ప్రస్థావిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అవును... ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై కేసులు, జగన్ అసెంబ్లీకి హాజరుకాని విషయంపై వెంటాడుతున్న షర్మిల వ్యాఖ్యలు, రఘురామ కృష్ణంరాజు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక, కడపలో వర్రా రవీందర్ రెడ్డి వ్యవహారం తీవ్ర హాట్ టాపిక్ లుగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో ఈ వ్యవహారాలపై రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఇందులో భాగంగా... జగన్ అసెంబ్లీకి రావాలని తాను చాలా సార్లు కోరానని.. అయితే ప్రజలు తిరస్కరించినప్పటికీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబట్టడం సబబు కాదని.. ప్రజల సమస్యల కోసమైనా, పులివెందుల సమస్యల కోసమైనా జగనే అసెంబ్లీకి రావాలని రఘురామ అన్నారు.
ఇదే సమయంలో... అసెంబ్లీకి హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని.. తాము గెలిచినా అసెంబ్లీకి వెళ్లమని చెబుతూ ఎన్నికలకు వెళ్లాలని కోరారు! దీనిపై స్పందించిన రఘురామ... షర్మిల మాట్లాడినదానిలో న్యాయముందని.. అయితే.. వైసీపీ మరోసారి ఎన్నికలకు వెళ్తే.. 11 సీట్లు కాస్తా ఒక్క సీటు అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
ఇక ఏదైనా ప్రభుత్వ పరిపాలన బాగోకపోతే.. ఆ విషయాన్ని ప్రస్థావిస్తూ, విమర్శిస్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే.. వాటిని ఖండిస్తూ పోస్టులు పెట్టాలి కానీ.. ఇంటలో ఉన్న తల్లి, చెల్లి, భార్య లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు!
ఇదే సమయంలో... వర్రా రవీంద ర్ రెడ్డి వ్యవహారంపైనా స్పందించారు. సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ అయిన తర్వాత ఇలాంటి పోస్టులు పెడుతున్నామని, ఈ పోస్టుల వెనుక ఆయన మార్గదర్శకాలు ఉన్నాయన్నట్లుగా వర్రా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారనే విషయంపై స్పందిస్తూ... దీని వెనుక కచ్చితంగా సదరు సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.