టీడీపీకి గుడివాడ టెన్షన్.. రఘురామా? రామూనా? ఇద్దరిలో ఎవరు?

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి.

Update: 2025-01-28 08:30 GMT

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. పార్టీకి ప్రతిష్ఠాత్మకమైన గుడివాడలో గెలిచామనే ఆనందం మూనాళ్ల ముచ్చటగానే మారుతోంది. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ఏరికోరి తీసుకువచ్చిన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము ప్రవర్తన కొత్త తలనొప్పులు తీసుకువస్తోంది. ముఖ్యంగా డిప్యటీ స్పీకర్ రఘురామక్రిష్ణంరాజు కేసులో నిందితుడు కామేపల్లి తులసిబాబును ఎమ్మెల్యే వెనకేసుకు రావడం దుమారం రేపుతోంది.

రఘరామపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఎమ్మెల్యే రాము అనుచరుడు కామేపల్లి తులసిబాబు అరెస్టు తర్వాత పరిణామాలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలనేది డిప్యూటీ స్పీకర్ రఘురామ డిమాండ్. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి రాడానికి నాటి సంఘటన కూడా ఓ కారణం. అధికార పార్టీ ఎంపీగా ఉన్న వ్యక్తిపై పోలీసు కస్టడీలో దాడి చేయడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో అంతా భయపడేట్టు చేసింది. దీంతో చాలామంది రఘురామపై సానుభూతి వ్యక్తం చేశారు. ఆ సానుభూతే రఘురామకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టింది. ఇక నిత్యం రచ్చబండ పేరుతో నాటి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేసిన రఘురామ టీడీపీకి బలమైన ఆయుధాలు అందించేవారు. ఇలా టీడీపీకి, అధినేత చంద్రబాబుకు దగ్గరైన రఘురామకు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతోపాటు గెలిచిన తర్వాత సముచిత పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో డిప్యూటీ స్పీకర్ ను చేసింది. ఇంతవరకు టీడీపీతోనూ అధినేత చంద్రబాబుతోనూ రఘురామకు అంతా మంచిగానే కనిపించింది. అయితే ఇప్పుడు తనపై దాడి చేసిన వ్యక్తితో గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే రాసుకుపూసుకు తిరగడం, దానిపై పార్టీ ఏ విధంగా స్పందించకపోవడమే రఘురామలో అసంతృప్తి రాజేస్తోంది.

మరోవైపు ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా పార్టీ అధిష్ఠానానికి దగ్గర వ్యక్తే. గుడివాడలో టీడీపీ గెలుపు ఆ పార్టీలో ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా భావించారు. మాజీ మంత్రి కొడాలి నాని ఓటమిని చూడాలని టీడీపీలో సాధారణ కార్యకర్త సైతం ఎన్నో కలలు కన్నాడు. అయితే ఆ కలలను ఎన్ఆర్ఐ రాము నెరవేర్చారు. విదేశాల్లో సంపాదన వదులకుని వచ్చిన వెనిగండ్ల దాదాపు రెండున్నరేళ్లుగా గుడివాడలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. టీడీపీకి దగ్గరై ఆ పార్టీ టికెట్ సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇలా ఇటు రఘురామ, అటు వెనిగండ్ల రాము టీడీపీకి రెండు కళ్లు, చెవుల్లా మారారు. అయితే అనూహ్యంగా రఘురామపై కస్టోడియల్ టార్చర్ కేసు పార్టీని ఇరకాటంలో పడేస్తోంది. పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా మైలేజ్ తేవడంతోపాటు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడిన రఘురామ వైపు నిలబడాలా? లేక గుడివాడలో పార్టీ ప్రతిష్ఠను కాపాడిన రామును వెనకేసుకు రావాలా? అనేది టీడీపీ అధిష్ఠానం తేల్చుకోలేకపోతోంది. రఘురామపై దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేయించినా, ఆయనతో సంబంధం లేదని ఎమ్మెల్యేతో చెప్పించలేకపోవడం టీడీపీ నిస్సహాయతకు నిదర్శనంగా మారింది.

టీడీపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసిన నిందితుడు కామేపల్లి తులసిబాబుకి గుడివాడతో సంబంధం లేకపోయినా, ఆయన గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో టీడీపీ నేతగా చలామణీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. బాపట్ల జిల్లాలో జె.పంగులూరు మండలం రామకూరుకు చెందిన తులసిబాబు సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ అనుచరుడిగా చెబుతున్నారు. ఆయనతో ఉన్న పరిచయంతోనే గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్లకు దగ్గరైన తులసిబాబు ఎన్నికల్లో రాము విజయానికి పనిచేశారని చెబుతున్నారు. ఇక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే రాము అనుచరుడిగా నియోజకవర్గంలో అన్నీతానై పనిచేస్తున్న తులసిబాబు అరెస్టు తర్వాత అదే జోరు చూపిస్తున్నాడు. ఇదే డిప్యూటీ స్పీకర్ రఘురామకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

తనపై దాడి చేసిన నిందితుడితో అనుబంధం కొనసాగిస్తున్న ఎమ్మెల్యే రాముపై చర్యలు తీసుకోవాలని రఘురామ కోరుతున్నారు. ఇటీవల నిందితుడి గుర్తింపు పెరేడ్ కు వెళ్లిన రఘురామ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాముకు పార్టీలో ఎటువంటి పదవులు లేవని వ్యాఖ్యానించారు. ఓ ఎమ్మెల్యేకు పార్టీతో సంబంధం లేదని రఘురామ చెప్పాలని భావించడమే ఆసక్తికరంగా మారింది. దీంతో తానో, ఎమ్మెల్యే రామునో తేల్చుకోవాలని పరోక్షంగా అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లైంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ టీడీపీలో కాక పుట్టిస్తుండగా, ఆ పార్టీ అధిష్ఠానం ఈ ఇష్యూను ఎలా సెటిల్ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

Tags:    

Similar News