సాయిరెడ్డి మంచోడు.. పార్టీ కోసం ఇల్లు, ఆఫీసు అమ్ముకున్నాడు : రఘురామ కీలక వ్యాఖ్యలు

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆశ్యర్యం వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-25 06:58 GMT

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కీలకవ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఉప్పు-నిప్పులా ఉండే తమ మధ్య ఒకప్పుడు మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా విజయసాయిరెడ్డిని విభేదించినానని, వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి మంచి వ్యక్తంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతేకాకుండా వైసీపీ కోసం విజయసాయిరెడ్డి తన ఇల్లు, కార్యాలయాన్ని విక్రయించినట్లు రఘురామరాజు వెల్లడించారు. విజయసాయిరెడ్డి రాజీనామా వేళ రఘురామ రాజు కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. పార్టీ కోసం విజయసాయిరెడ్డి అంత త్యాగం చేశాడా? అంటూ అంతా ఆరా తీస్తున్నారు.

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆశ్యర్యం వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆయనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డితో రాజకీయంగా తాను విభేదించాను, కానీ ఆయనతో తనకు వ్యక్తిగత కక్షలేమీ లేవన్నారు. ఏ రకంగా చూసినా సాయిరెడ్డి చెడు వ్యక్తి కాదని కితాబిచ్చారు. కాగా, ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్న విషయం తెలిసిందే. రఘురామ వైసీపీ ఎంపీగా ఉండగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా రఘురామపై శ్రుతిమించిన విమర్శలు చేసేవారు. దీనికి రఘురామ కూడా అంతేఘాటుగా స్పందించేవారు. ఇక ఇప్పుడు విజయసాయిరెడ్డి నిష్క్రమణ ప్రకటన తర్వాత ఆయనపై రఘురామ చేస్తున్న కామెంట్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

గతంలో వైసీపీ మనుగడ కోసం విజయసాయిరెడ్డి తన ఇల్లు, కార్యాలయాలను అమ్ముకున్నట్లు రఘురామ వెల్లడించారు. ఇందులో ఎంత నిజముందో గానీ, విజయసాయిరెడ్డికి బద్ధ విరోధిగా ముద్రపడిన త్రిపుల్ ఆర్ సంచలన విషయాలు చెప్పడం ఆసక్తి రేపుతోంది. వైసీపీ ఆవిర్భవం తర్వాత 2014 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ఆశించింది. అయితే అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక ఆ తర్వాత పార్టీని నిలబెట్టుకోవడం కోసం మాజీ సీఎం జగన్ ఎంతో ప్రయత్నించారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రత్యర్థిని దెబ్బతీసే క్రమంలో వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించింది. ఏకంగా 23 మంది సిటింగ్ ఎమ్మెల్యేలను లాగేసుకుంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ మనుగడే ప్రశ్నార్థకమైంది. దీంతో పార్టీని బతికించుకునేందుకు అధినేత జగన్ పాదయాత్రకు పూనుకున్నారు. దాంతో పార్టీని నడిపడంతోపాటు ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యత విజయసాయిరెడ్డిపై పడింది. ఆ సమయంలోనే విజయసాయిరెడ్డి తన ఇల్లు, ఆఫీసు అమ్ముకున్నట్లు రఘురామ చెబుతున్నారు. అప్పుడు రఘురామ కూడా వైసీపీలోనే ఉండేవారు. దీంతో రఘురామ మాటల్లో నిజం ఉండొచ్చని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నాయంటున్నారు.

ఇక వైఎస్ కుటుంబంతో విజయసాయిరెడ్డికి మూడు తరాల అనుబంధం ఉంది. మంచి పేరున్న ఆడిటరుగా విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. తొలుత వైఎస్ రాజారెడ్డి, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి తరఫున వారి ఆర్థిక వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డే చూసేవారు. ఇక ఈ ఇద్దరి మరణాంతరం జగన్ కు దగ్గరైన విజయసాయిరెడ్డి ఆయన రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈడీ, సీబీఐ కేసులతో జగన్ తోపాటు అరెస్టు అయిన విజయసాయిరెడ్డి వైసీపీ ఆవిర్భావంలో కీలకంగా పనిచేశారు. అలా పార్టీలో నెంబర్ టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ కూడా ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. ఈ క్రమంలోనే తన వృత్తికి దూరమైన విజయసాయిరెడ్డి ఆ తర్వాత పార్టీని బతికించుకోడానికి ఇల్లు, ఆఫీసు అమ్ముకున్నారని తాజాగా రఘురామ చెబుతుండటం ఇంట్రెస్టింగుగా మారింది.

Tags:    

Similar News