తప్పులు సరిద్దుకోమంటున్న ట్రిపుల్ ఆర్... ఇంకా ఉంది!

ఈ సమయంలో ఈ మూడు పార్టీలలో ఏ ఒక్క పార్టీ కూడా రఘురామ కృష్ణంరాజుకి టిక్కెట్ ఇవ్వకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-03-31 04:23 GMT

ఏపీలో రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ ని ఎలాగైన గద్దె దింపాలనే సింగిల్ అజెండాతో టీడీపీ - జనసేన - బీజేపీ కలిసిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో సీట్ల సర్దుబాటు చేసుకుని, అభ్యర్థుల ఎంపికలు పూర్తి చేశాయి. ఒక్క జనసేన మాత్రమే ఇంకా కొన్ని స్థానాలను పెండింగ్ లో ఉంచింది. ఈ సమయంలో ఈ మూడు పార్టీలలో ఏ ఒక్క పార్టీ కూడా రఘురామ కృష్ణంరాజుకి టిక్కెట్ ఇవ్వకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ట్రిపుల్ ఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అవును... 17 ఎంపీ టిక్కెట్లు తీసుకున్న టీడీపీ కానీ, 6 స్థానాలు దక్కించుకున్న బీజేపీ కానీ రఘురామ కృష్ణంరాజుకి ఒక ఎంపీ టిక్కెట్ ఇవ్వలేకపోయాయి! ఇక ఎన్నో త్యాగాలు చేసిన జనసేన.. ట్రిపుల్ ఆర్ కోసం మరో త్యాగం చేయలేకపోయింది! ప్రస్తుతం రఘురామ ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ ఈ తరహాలోనే జరుగుతుంది. మరోపక్క ఈయన ఏ పార్టీకి చెందినవాడని టిక్కెట్ ఇస్తారు అనేది మరో చర్చ కాగా... ట్రిపుల్ ఆర్ ని అకామిడేట్ చేయాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందనేది మరో పాయింట్ గా ఉంది.

ఈ సమయంలో పొత్తులో భాగంగా చంద్రబాబు.. నరసాపురం టిక్కెట్ ని బీజేపీకి ఇచ్చారు! దీంతో... తమ పార్టీ సీనియర్ కార్యకర్త అయిన శ్రీనివాస వర్మ కు ఆ టిక్కెట్ ఇచ్చుకుంది బీజేపీ. దీంతో... టిక్కెట్ ఇవ్వని బీజేపీపైనా.. నరసాపురం టిక్కెట్ తనకోసం అట్టిపెట్టని చంద్రబాబు పైనా స్పందించలేకో ఏమో కానీ... తనకు టిక్కెట్ దక్కకపోవడానికి జగన్ కారణం అని మొదలుపెట్టారు రఘురామ. ఇది జగన్ తాత్కాలిక విజయం అని చెబుతూ తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు సవినయంగా పేర్కొన్నారు!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మైకుల ముందుకు వచ్చిన ఆయన.. కూటమిగా ఏర్పడిన బీజేపీ - జనసేన - టీడీపీలు... సీట్ల కేటాయింపు విషయంలో కొన్ని తప్పులు చేసాయని అంటున్నారు ట్రిపుల్ ఆర్. ఈ సమయంలో వాటిని సరిదిద్దుకుంటే మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో... కూటమి తరుపున తనకు టిక్కెట్ వస్తుందనే నమ్మకం ఉందని రఘురామ ఇప్పటికీ చెబుతుండటం గమనార్హం. అయితే.. ఇండీపెండెంట్ గా పోటీ చేసేది లేదని మాత్రం నొక్కి చెప్పారు.

ఇదే సమయంలో రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపే కన్ ఫాం అని చెప్పుకొచ్చిన రఘురామ... ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని జోస్యం చెప్పారు! ఈ విషయాన్ని బల్ల గుద్ది చెబుతున్నట్లు చెప్పిన ఆయన... రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి గెలుపు అనివార్యం అని తెలిపారు. ఏది ఏమైనా... సీట్ల కేటాయింపుల్లో కొన్ని తప్పులు చేశారని చెబుతున్న ట్రిపుల్ ఆర్... తనకు టిక్కెట్ వస్తుందనే నమ్మకం ఉందని చెబుతుండటం గమనార్హం.

మరి ఈ సస్పెన్స్.. లేక, ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఎప్పటిలోపు రావొచ్చు అనేది వేచి చూడాలి. రఘురామ మాత్రం ఫుల్ కాన్ ఫిడెన్స్ గా ఉన్నారు. మరి ఆయనను కూటమి కరుణిస్తుందా.. లేక, ఈసారి త్యాగాలు చేసిన వారి జాబితాలో ఆయన పేరు కూడా చేరుకోవాలా అనేది వేచి చూడాలి!

కాగా... తనకు నరసాపురం ఎంపీ టిక్కెట్ దక్కకపోవడంపై ఒక ఇంటర్వూలో స్పందించిన రఘురామ... చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... నమ్ముకున్న తనలాంటి వారికే టిక్కెట్ ఇప్పించుకోలేకపోతే... ఇక రేపు గెలిచిన తర్వాత పోలవరం ప్రాజెక్టు వంటి వాటిని ఎలా సాధిస్తారని ప్రజలు భావించే అవకాశం ఉందంటూ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే!!

Tags:    

Similar News