తెలంగాణ ఆర్థిక సమస్యలకు రఘరామ్ రాజ్ చికిత్స!

సూచనలు ఇచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ అధినాయకత్వం ఆర్ బీఐ మాజీ గవర్నర్ .. ఆర్థిక నిపుణుడు అయిన రఘురామ రాజన్ ను ప్రత్యేకంగా దించినట్లుగా చెబుతున్నారు.

Update: 2023-12-18 04:40 GMT

మోడీ ప్రభ దేశవ్యాప్తంగా వెలిగిపోతున్నవేళ.. ఆయన ధాటికి తట్టుకొని మరీ వేళ్ల మీద లెక్కేసే రాష్ట్రాల్లో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్.. ఆ రాష్ట్రాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగా తనకున్న వనరుల్ని పెద్ద ఎత్తున వినియోగించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల అధికారాన్ని హస్తగతం చేసుకున్న తెలంగాణపై కాంగ్రెస్ అధినాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలన నేపథ్యంలో అప్పుల కుప్పగా మారిన ఆర్థిక పరిస్థితికి చికిత్స చేయటంతో పాటు.. ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలన్న దానిపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఓవైపు ఆర్థిక లోటు కొండ మాదిరి ఉన్న వేళ.. ఆరు గ్యారెంటీ హామీల్ని ఎలా నెరవేర్చాలి? నిధుల సమీకరణ ఎలా? రాష్ట్ర ఆర్థిక స్థితిని మరింత మెరుగుపర్చేందుకు ఏం చేయాలి? లాంటి అంశాలకు సరైన సలహాలు.. సూచనలు ఇచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ అధినాయకత్వం ఆర్ బీఐ మాజీ గవర్నర్ .. ఆర్థిక నిపుణుడు అయిన రఘురామ రాజన్ ను ప్రత్యేకంగా దించినట్లుగా చెబుతున్నారు.

తాజాగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ ఇంటికి వెళ్లటం.. అక్కడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన మాట్లాడటం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయాల్సిన చికిత్స ఏమిటన్న దానిపై చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రచారానికి తగ్గట్లే మంత్రివర్గంలోని ముఖ్యులైన మంత్రులతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఆర్థిక శాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావులు కూడా హాజరు కావటం గమనార్హం.

యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా వ్యవహరించిన అనుభవం రాజన్ కు ఉంది. అలాంటి ఆయనకు.. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సమస్యలకు పరిష్కారాన్ని వెతకటం అంత కష్టమైన పని కాదు. అందుకే.. రాష్ట్ర అప్్పులు.. చెల్లించాల్సిన వడ్డీలతో పాటు.. వాటికి సంబంధించిన వివరాల్ని తెలుసుకున్న రాజన్.. ఇప్పటికిప్పుడు రాష్ట్రం చేపట్టాల్సిన చర్యల గురించి పలు సూచనలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా పెద్ద సవాలుగా మారిన ఆర్థిక పరిస్థితికి రాజన్ తనకున్న అనుభవంతో ఒక గాటున పెడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News