కాశ్మీర్ తో కరెక్ట్ కనెక్షన్ సెట్ చేసిన రాహుల్
కాశ్మీర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
కాశ్మీర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు కుదుర్చుకున్నారు. ఈ పొత్తు కంటే ముందు నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. అయినా ఫరూక్ అబ్దుల్లా ఇంటికి రాహుల్ గాంధీ స్వయంగా వెళ్ళి మరీ పొత్తులకు ఓకే చేసుకున్నారు.
దాంతో బలమైన రాజకీయ ఘట్ బంధన్ ఏర్పడింది. కాశ్మీర్ లో చూస్తే బీజేపీది ఒంటరి పోరు. ఏటికి ఎదురీత గానే ఉంది. పీడీఎఫ్ తో పొత్తు ఉండే చాన్సే లేదు. ఎందుకంటే ఆ పార్టీ అజెండా ప్రత్యేక ప్రతిపత్తి, 370 ఆర్టికల్ రద్దు కాబట్టి.
దాంతో బీజేపీ కేవలం జమ్మూలోని తన బలాన్ని చూసుకుంటూనే పోటీ చేస్తోంది. బీజేపీ అధికారంలోకి సొంతంగా రావడం ఒక అద్భుతం అయితే ఎక్కువ సీట్లు అయినా దక్కించుకోవడం మరో అద్భుతమే అని అంటున్నారు. సరే బీజేపీ ఆలోచనలు ఎత్తుగడలూ ఎలా ఉంటాయో ముందు ముందు చూడాల్సి ఉంది.
కానీ కాంగ్రెస్ మాత్రం కాశ్మీర్ లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఇక రాహుల్ గాంధీ అయితే కాశ్మీర్ తో బలమైన కాంగ్రెస్ కనెక్షన్ ని మరోసారి చాటారు. అంతే కాదు తన కుటుంబ నేపధ్యాన్ని వల్లె వేస్తున్నారు. తమ కుటుంబానికి కాశ్మీర్ తో రక్త సంబంధం ఉందని ఎక్కడో టచ్ చేసారు.
రాహుల్ గాంధీ ముత్తాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఆయన తండ్రి మోతీలాల్ నెహ్రూ కాశ్మీర్ పండిట్లు అన్న సంగతి తెలిసిందే. ఆ బంధాన్నే రాహుల్ గుర్తు చేస్తూ తనది కాశ్మీరే అని క్లెయిం చేసుకున్నారు అన్న మాట. కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇస్తామని కూడా రాహుల్ మరో రాజకీయ వ్యూహాన్ని బయటకు తీసారు.
జమ్మూ కాశ్మీర్ ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడం ద్వారా బీజేపీ గత అయిదేళ్ళుగా కేంద్ర పాలన చేసింది. దాని మీద కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే రాజు ఉంటారని ఆ రాజు ఢిల్లీ పాలకులకు అనుకూలంగా పనిచేస్తారు అని కాశ్మీరీల కలలు సాకారం కావని కూడా చెప్పారు.
ఇలా బహుముఖ వ్యూహంతో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కాశ్మీర్ విషయంలో ఉన్నారు. కాశ్మీర్ లో బీజేపీకి టఫ్ ఫైట్ ని ఇస్తున్నారు. ఒక విధంగా చుక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ట్రయాంగిల్ ఫైట్ అయ్యేలాగానే కాశ్మీర్ ఎన్నికలు ఉన్నాయి. కానీ పీడీఎఫ్ మునుపటి బలంతో లేదు.
అందువల్ల ఆ పార్టీ ముస్లిం ఓట్లను పెద్దగా చీల్చే చాన్స్ లేదని అంటున్నారు.దాని కంటే ముందు ఈ ఎన్నికలు బీజేపీ వర్సెస్ అదర్స్ గా సాగుతాయి. పైగా కాశ్మీరీల ప్రత్యేక ప్రతిపత్తితో పాటు ఒకే బలమైన రాష్ట్రం ఆ హోదాను కోరుకుంటున్నారు అని అంటున్నారు. మైనారిటీలు అయితే గుత్తమొత్తంగా కాంగ్రెస్ నేషనల్ కాంఫరెన్స్ కూటమికి ఓటు చేస్తారు అని అంటున్నారు దాంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయి.
కాశ్మీర్ తో బలమైన బంధాన్ని పెనవేసుకోవడానికి కాంగ్రెస్ చూస్తోంది. మరి మోడీ కాశ్మీర్ విషయంలో ఏమి చెబుతారో చూడాల్సి ఉంది. కాశ్మీర్ ని భారత్ లో అంతర్భాగం చేసి దేశంతో కలిపి చిక్కని బంధాన్ని వేశామని బీజేపీ మోడీ చెబుతారా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి చూస్తే కాశ్మీర్ లో ఈ బంధాలలో ఏది నెగ్గుతుంది అన్నది కూడా ఆసక్తికరమైన వయవహారమే.