రాహుల్‌ కు ఎంత ప్రేమ.. స్వయంగా షాపుకు వెళ్లి.. గిఫ్టు కొని!

ఒక స్వీట్‌ దుకాణానికి వెళ్లిన రాహుల్‌.. స్టాలిన్‌ కోసం మైసూర్‌ ప్యాక్‌ స్వీట్లు కొన్నారు. స్వీట్‌ ప్యాకెట్ల గిప్టును స్వయంగా స్టాలిన్‌ కు అందజేశారు.

Update: 2024-04-13 06:57 GMT

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌ లోని అమేథి, కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ ఈసారి కేవలం వయనాడ్‌ నుంచే బరిలోకి దిగుతున్నారు.

ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో రాహుల్‌ గాంధీ ఉన్నారు. కాంగ్రెస్, డీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన ప్రచారానికి కాస్త విరామమిచ్చారు. ఈ విశ్రాంతి సమయంలో రాహుల్‌ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా ఆయన సింప్లిసిటీని అంతా మెచ్చుకుంటున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌ కోసం స్వయంగా రాహుల్‌ గాంధీ షాపింగ్‌ చేశారు. ఒక స్వీట్‌ దుకాణానికి వెళ్లిన రాహుల్‌.. స్టాలిన్‌ కోసం మైసూర్‌ ప్యాక్‌ స్వీట్లు కొన్నారు. స్వీట్‌ ప్యాకెట్ల గిప్టును స్వయంగా స్టాలిన్‌ కు అందజేశారు. ఆ గిప్టును అందుకున్న స్టాలిన్‌.. రాహుల్‌ అభిమానానికి ముగ్దుడయ్యారు. ఆయన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు స్టాలిన్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. తన సోదరుడు రాహుల్‌ గాంధీ అందించిన స్వీట్‌ కానుకతో తన హృదయం నిండిపోయిందని తెలిపారు. జూన్‌ 4న ఇండియా కూటమి కూడా ఇలాంటి తీపి విజయాన్ని అందుకుంటుందని ఆయన ఆకాంక్షించారు.

తమిళనాడులో రెండో అతిపెద్ద నగరమైన కోయంబత్తూరులో స్టాలిన్, రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం ముగిశాక రాహుల్‌ సింగనల్లూరులో ఉన్న ఒక స్వీట్‌ షాపుకు వెళ్లారు. అక్కడ స్వీట్స్‌ ను కొనుగోలు చేసి స్టాలిన్‌ కు అందజేశారు.

స్వీట్‌ షాపుకు వెళ్లడానికి రాహుల్‌ రోడ్డు డివైడర్‌ ను దాటుకుని అవతల వైపు వెళ్లడం విశేషం, ఈ వీడియోను కాంగ్రెస్‌ పార్టీ తమ సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

మరోవైపు స్వయంగా రాహుల్‌ గాంధీ తమ షాపుకు రావడంతో స్వీట్‌ దుకాణంలోని సిబ్బంది సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇంతలోనే ఆ ఆశ్చర్యం నుంచి తేరుకుని.. రాహుల్‌ కు ఏం కావాలో అడిగారు. దీంతో రాహుల్‌ తనకు మైసూర్‌ ప్యాక్‌ కావాలని అడిగారు. ఈ క్రమంలో షాపులో ఉన్న కొన్ని స్వీట్లను రాహుల్‌ స్వయంగా రుచిచూశారు.

Tags:    

Similar News