యుద్దాన్ని ఆపిన మోడీ పేపర్ లీకేజీ ఆపలేడా ?

ప్రభుత్వ తీరుతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారయిందని, పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాహుల్ అన్నారు.

Update: 2024-06-20 16:36 GMT

ప్రధానమంత్రి నరేంద్రమోడి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారని చెబుతుంటారు. కానీ దేశంలో పోటీ పరీక్షల పేపర్ లీకేజీని మాత్రం ఆపలేకపోతున్నారు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలో విద్యాసంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు.

పరీక్షల లీకేజీని కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోతోందని, విద్యాసంస్థలను బీజేపీ మాతృసంస్థ తన గుప్పెట్లో పెట్టుకుందని, ఇప్పటికే ఒక పరీక్షను రద్దు చేశారని, ఇక నీట్ పరీక్షపై ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదని రాహుల్ అన్నారు.

ప్రభుత్వ తీరుతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారయిందని, పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాహుల్ అన్నారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించినట్లవుతోందని, వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహ చర్యే అని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ ప్రభుత్వంలో దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ అనేది లేకుండా పోయిందని, ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సరికాదని, నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని, ప్రశ్నాపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ నిలదీశారు. దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News