రాహుల్‌కు 'దుష్ట శకునం' ఉచ్చు.. తెలంగాణ ప్రచారంపై ఎఫెక్ట్!
ఈ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ నేతలు.. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూనే.. మరోవైపు లోకల్ పోలీసులకు కూడా(రాజస్థాన్) కంప్లెయింట్ ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి మరో కేసు ఎదురొచ్చింది. ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆయనను దుష్ట శకునం-అపశకునం-దుశ్శకునంతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ నేతలు.. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూనే.. మరోవైపు లోకల్ పోలీసులకు కూడా(రాజస్థాన్) కంప్లెయింట్ ఇచ్చారు.
అయితే, రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్న నేపథ్యంలో దీనిని స్వీకరించలేదు. కానీ, ఎన్నికల సంఘం మాత్రం రియాక్ట్ అయింది. శనివారం సాయంత్రం 5 గంటల కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేనిపక్షంలో చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటే.. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో రాహుల్‌పై ప్రచారం చేయకుండా వేటు పడే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఏం జరిగింది?
గత ఆదివారం వన్డే ప్రపంచకప్ పోటీల ఫైనల్ మ్యాచ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్-ఆస్ట్రేలియాలు తలపడ్డాయి. అయితే.. భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ నేరుగా స్టేడియంకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఉటంకిస్తూ.. రాహుల్ గాంధీ.. "స్టేడియంలో మన కుర్రోళ్లు చెలరేగి ఆడారు. దీంతో కప్పు మనదే అయిపోయేది. కానీ, ఇంతలోనే పనౌతీ(దుష్టశకునం) అడుగు పడింది. దీంతో వచ్చే కప్పు కూడా జారిపోయింది. అదీ ఆ కాలు(మోడీ) మహిమ" అని వ్యాఖ్యానించారు. దీనిపైనే ఇప్పుడు బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం.