కేటీఆర్.. హరీశ్ లు కలిసి కేసీఆర్ ను తిట్టిస్తున్నారే?
కెలికి మరీ కంపు చేసుకుంటున్న కేటీఆర్.. హరీశ్ రావుల కారణంగా గులాబీ అధిపతి కేసీఆర్ కు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి.
మనం ఒక మాట అంటే.. ఎదుటోడు ఉత్తినే ఊరుకోడు. తెలివి ఎవరి సొంతం కాదన్న విషయాన్ని ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకున్న గులాబీ నేతలకు ఇంకా అర్థం కావట్లేదన్నట్లుగా ఉంది. ఓడినోళ్లకే అంతుంటే.. గెలిచినోళ్లకు మరెంత ఉంటుందన్నట్లుగా టీ కాంగ్రెస్ నేతలు తమ మాటల్లో చెప్పకనే చెప్పేస్తున్నారు. కెలికి మరీ కంపు చేసుకుంటున్న కేటీఆర్.. హరీశ్ రావుల కారణంగా గులాబీ అధిపతి కేసీఆర్ కు కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి.
ఎన్నికల్లో ఓటమి మొత్తం గులాబీ నేతల అహంకారం చుట్టూనే ఉందన్న విషయాన్ని గులాబీ పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్.. హరీశ్ లు ఇంకా గుర్తించనట్లుగా కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. అసెంబ్లీకి రాని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గురించి అధికార పక్ష నేతలు ప్రస్తావించగా.. అందుకు బదులుగా కేటీఆర్.. హరీశ్ లు.. తమ అధినాయకుడు అవసరం లేదని.. సమాధానం చెప్పేందుకు తాము సరిపోతామంటూ చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఇప్పటికే ఘాటు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు.. ఆ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ.. కేసీఆర్ ను కార్నర్ చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గులాబీ ముఖ్యనేతలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ విషయంలో జరిగిన సుదీర్ఘ చర్చ నేపథ్యంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. ‘‘సమాధానం చెప్పేందుకు మీరు సరిపోతే.. ప్రధాన ప్రతిపక్ష పదవిలో కేసీఆర్ ఎందుకు? సమాధానం చెప్పేందుకు మేం చాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆ పదవిలో ఆయన అవసరం ఏముంది?’’ అంటూ పంచ్ వ్యాఖ్యలు చేశారు.
విద్యుత్ అంశం మీద జరిగిన చర్చలో రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుందని.. కాలం చెల్లిన విధానాలతో ప్లాంట్లను నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకున్నారన్నారు. బొగ్గు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ప్లాంట్లు పెడతారని బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుందాన్నారు. కేసీఆర్ రాచరిక వ్యవస్థలో రాజు మాదిరి వ్యవహరించటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలినట్లుగా పేర్కిన్నారు. ఉచిత కరెంటు తామే ఇస్తున్నట్లుగా బీఆర్ఎస్ చెప్పుకుంటుందని.. ఉచిత కరెంటు తొలుత ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ సర్కార్ అంటూ గతాన్ని ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే.. రేవంత్ సర్కారును ఇరుకున పెట్టాలన్న తొందరలో కేటీఆర్, హరీశ్ లు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసే కన్నా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మంచిది. లేదంటే.. సభకు రావట్లేదు అపప్రధ ఎదుర్కొంటున్న గులాబీ బాస్ కు తమ వ్యాఖ్యలతో మరిన్ని తిట్లు తినేలా చేస్తున్నామన్న విషయాన్ని వారు గుర్తిస్తే మంచిది.