రాజకీయం మార్చిన రాజమండ్రి జైలు !

బాబు అరెస్ట్ రిమాండ్ అన్నది ఎంత అనూహ్యమో జనసేన టీడీపీ పొత్తు ప్రకటన ఇంత ముందుగా బయటకు రావడం కూడా అనూహ్యమే.

Update: 2023-09-14 11:53 GMT

రాజమండ్రి గోదావరి జిల్లాలలో ఉంది. ఉమ్మడి ఏపీ నుంచి చూసుకుంటే కనుక రాజకీయాలు ఎపుడూ గోదావరి జిల్లాలే మారుస్తూ ఉంటాయి. గోదావరి తీర్పుతోనే ఉమ్మడి ఏపీ అయినా విభజన ఏపీ అయినా అధికారం మారుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే అదే గోదావరి నడిబొడ్డు రాజమండ్రి ఏపీ రాజకీయాన్ని మార్చింది అని చెప్పాల్సి ఉంది.

చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులోని స్నేహా బ్లాక్ లో జ్యూడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనతో జనసేన అధినేత పవన్ ములాఖత్ అవుతారు అనుకుంటే అది జస్ట్ పరామర్శగానే అంతా అనుకున్నారు తప్ప అక్కడే పొత్తు పొడుస్తుందని అది అర్జంటుగా జైలు బయటనే ప్రకటనగా మారుతుందని ఎవరూ ఊహించలేకపోయారు.

బాబు అరెస్ట్ రిమాండ్ అన్నది ఎంత అనూహ్యమో జనసేన టీడీపీ పొత్తు ప్రకటన ఇంత ముందుగా బయటకు రావడం కూడా అనూహ్యమే. పవన్ కళ్యాణ్ టీడీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారు అని అంతా అనుకుంటున్నదే. అయితే ఏపీలో మారిన రాజకీయం జనసేనకు పెరిగిన గ్రాఫ్, సీఎం అభ్యర్ధిగా పవన్ని చూడాలని ఆయన పార్టీ నేతలు అనుకోవడం, క్యాడర్ అంతా పవన్ సీఎం అంటూ జేజేలు పలకడం కాపు సామాజికవర్గంలో కూడా తమవాడే సీఎం కావాలని ఉన్న బలమైన ఆకాంక్ష. ఏపీలో టీడీపీ వైసీపీ తరువాత జనసేన నుంచి పవన్ కే సీఎం చాన్స్ రావాలన్న కొన్ని తటస్థ వర్గాల మాట ఇవన్నీ చూసుకున్నపుడు కచ్చితంగా పొత్తు విషయంలో చాలా పేచీ పూచీలు ఉంటాయని అనుకున్నారు.

పవన్ కళ్యాణ్ గట్టిగానే బేరాలు పెడతారని, అవి కాస్తా ఏ యాభై అరవై సీట్ల దగ్గరలో ఆగుతాయని కూడా ఊహించారు. నిజానికి పొత్తు ప్రకటన అంటే అంత ఈజీగా కాదు, చాలా ఆలోచించాలి. ఎన్నో మల్లగుల్లాలు ఉంటాయి. దానికి ముందు అటూ ఇటూ పార్టీలలో చర్చలు ఉంటాయి. కానీ ఏమీ కాకుండా జస్ట్ ఒక్క ములాఖత్ తో పొత్తు ప్రకటన చేశారు పవన్ అంటే ఇవన్నీ ముందే జరిగి ఉండాలని అనుకోవాలి.

లేదా ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా ఏపీ ప్రజలకు ఆల్టర్నేషన్ కోసం వస్తున్నామని చెప్పడానికైనా ఉండాలి. అలా కనుక చూసుకుంటే పవన్ పొత్తు ప్రకటన వెనక తొందరపాటు లేదు అని కూడా అనుకోవచ్చు. ఆయన ఆషామాషీగా కూడా ప్రకటన చేసి ఉంటారని ఎవరూ భావించనక్కలేదు.

ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో ఇపుడు కనుక గట్టిగా నిలబడితేనే పొత్తు పెట్టుకున్నా అర్ధం అందం ఉంటుందని భావించి ఉండాలి. చంద్రబాబు జైలు పాలు కావడంతో ఒక విధంగా టీడీపీ క్యాడర్ కకావికలం అయింది. జనసేన విషయం తీసుకుంటే సంస్థాగతంగా ఇంకా బలంగా వేళ్ళూనుకోలేదు.

ఈ నేపధ్యంలో చంద్రబాబు బెయిల్ లేట్ అయి మరింతకాలం జైలులో ఉంటే టీడీపీ లో అయోమయం ఉంటుంది. జనసేన కూడా ఇబ్బందులో పడుతుంది. అందుకే రెండిందాల మేలు చేసేలా పవన్ ఈ ప్రకటన చేశారు అని అంటున్నారు. వాస్తవానికి ఈ ప్రకటన అటు చంద్రబాబు ఇటు పవన్ ఉండి చేయాలి. అది కూడా ఏ టీడీపీ ఆఫీసులోనో లేక ఉమ్మడి వేదిక వద్దనో చేయాలి.

కానీ బాబు లేకుండా పవన్ లోకేష్ బాలయ్యలను పక్కన పెట్టుకుని చేసిన ఈ ప్రకటన నిజంగా ఎవరూ ఊహించలేనిది. అయితే ఇది మాత్రం వ్యూహాత్మకమైనది అని చెప్పాలి. బాబు అరెస్ట్ రిమాండ్ వల్ల వచ్చిన సింపతీని పక్కకు పోనీయకుండా గట్టి బంధంతో మేము వస్తున్నామని చెప్పడం కోసమే ఈ పొత్తు ప్రకటన అని అంటున్నారు అదే టైం లో రేపటి నుంచి ఈ రెండు పార్టీలు జరిపే ఉమ్మడి కార్యక్రమాలు కార్యాచరణతోనే బాబుకు ఎంత సింపతీ ఉంది అన్నది తెలుస్తుంది.

ఇప్పటికైతే విడిగా టీడీపీ బంద్ కి పిలుపు ఇచ్చినా జనసేన దానికి సంఘీభావం ప్రకటించినా జనంలో అనుకున్న స్పదన అయితే రాలేదు. కానీ ఇపుడు ఉమ్మడి కార్యాచరణ వల్ల మాత్రం ఏదైనా మార్పు కనిపించినా సానుకూలత పెరిగినా అదే కూటమికి శ్రీరామ రక్షన్ కానుంది. మొత్తం మీద రాజమడ్రి జైలు ఏపీ రాజకీయాన్నే మార్చేసింది అని అంతా అంటున్నారు. కారణాలు ఏమైనా మరోసారి గోదావరి ఏపీ పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ అవుతుందా అన్నది 2024 ఎన్నికలు నిర్దారిస్తాయి.

Tags:    

Similar News