చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం!
ఎన్నికల సీజన్ వచ్చిందంటే... ప్రధాన పార్టీల అధినేతలు చాలా మంది యాగాలు, యజ్ఞాలు చేస్తుంటారు.
ఎన్నికల సీజన్ వచ్చిందంటే... ప్రధాన పార్టీల అధినేతలు చాలా మంది యాగాలు, యజ్ఞాలు చేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో ఏలాగైనా అధికారంలోకి రావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉంటారు. ఈ సమయంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు శుక్రవారం యాగం పూర్తయ్యింది.
అవును... టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇందులో భాగంగా యాభై మంది రుత్విక్కుల ఆధ్వర్యంలో ఈ యాగం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తొలి రోజు చంద్రబాబు దంపతులు యాగక్రతవులో పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించే పూర్ణాహుతితో ఇది ముగియనుంది.
గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు నివాసంలో రెండు మూడు నెలల వ్యవధిలో జరుగుతున్న రెండో యాగం ఇది. ఇందులో భాగంగా... గత డిసెంబర్ లోనూ చంద్రబాబు నివాసంలో యాగం జరిగింది. అప్పుడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.
కాగా... ఎన్నికలకు ముందు చాలా మంది రాజకీయ నాయకులు యాగాలు నిర్వహించడం సర్వసాధారణంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ లోని తన నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇక బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కూడా తన పామ్ హౌస్ లో శారదాపీఠాధి సమక్షంలో రాజశ్యామల యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే.