సెక్యులర్ వద్దు - హిందుత్వమే ముద్దు.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా... "నేను చచ్చినా సెక్యూలర్ పార్టీల్లోకి వెళ్లను. నా ప్రాణం పోతున్నా బీఆరెస్స్, కాంగ్రెస్ పార్టీల్లోకి పోను.. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం.

Update: 2023-08-29 13:28 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ అధికార పార్టీ బీఆరెస్స్ నాలుగు తక్కువ అన్ని అసెంబ్లీ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రకటించని నాలుగు స్థానల్లో అత్యంత కీలకమైన ఒక స్థానం భాగ్యనగరంలోని గోషామహల్! దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ వైపే అందరి దృష్టీ పడింది.

మ‌త విద్వేష ప్రక‌ట‌న‌లు చేసిన ఆయన్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆయన... 40 రోజుల‌కు పైగా జైలు జీవితం గ‌డిపారు. దీంతో... పార్టీకి న‌ష్టం వాటిల్లేలా వివాదాస్పద కామెంట్స్ చేశారంటూ... రాజాసింగ్‌ పై బీజేపీ స‌స్పెన్షన్ వేటు వేసింది. దీంతో రాజాసింగ్ పార్టీ మారతారనే కథనాలు పెరిగిపోయాయి.

అవును... బీజేపీ నుంచి సస్పెండ్ అవ్వడం, అనంతరం ఒకానొక సమయంలో కేటీఆర్ తో భేటీ అవ్వడంతో ఆయన పార్టీ మార్పూపై కీలక చర్చ నడించింది. ఈ సమయంలో తన పార్టీ మార్పు కథనాలపై రాజాసింగ్ స్పందించారు. పైగా... గోషామహల్ కు అభ్యర్థిని ప్రకటించకుండా కేసీఆర్ హోల్డ్ లో పెట్టడంపైనా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... "నేను చచ్చినా సెక్యూలర్ పార్టీల్లోకి వెళ్లను. నా ప్రాణం పోతున్నా బీఆరెస్స్, కాంగ్రెస్ పార్టీల్లోకి పోను.. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం.. బీజేపీ నుంచి టికెట్ రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ ఇతర పార్టీల్లో వెళ్లను.." అని రాజాసింగ్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో తాను హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటూ ముందుకెళ్తానని చెప్పిన రాజాసింగ్.. భారతీయ జనతపార్టీ తన విషయంలో అనుకూలంగా ఉందని.. తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.

ఇదే సమయంలో గోషామహల్ బీఆరెస్స్ ఎమ్మెల్యే టికెట్ ఎంఐఎం చేతిలో ఉందని చెప్పిన రాజాసింగ్... అందువల్లే కేసీఆర్ ఆ స్థానాన్ని పెండింగ్ లో పెట్టారని చెప్పారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆరెస్స్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News