మ్యాజిక్ ఫిగర్ 44 : జగన్ వర్సెస్ బాబుల లక్కీ నంబర్...!
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు ఎన్నుకునే ముగ్గురు సభ్యులకు జరిగే ఎన్నిక ఇది.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు ఎన్నుకునే ముగ్గురు సభ్యులకు జరిగే ఎన్నిక ఇది. అది కూడా అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ లిట్మస్ టెస్ట్ గా జరుగుతున్న ఎన్నిక కావడం విశేషం.
రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లకు ఖాళీలు ఏర్పడితే ముగ్గురినీ గెలిపించుకునేంత బలం అయితే వైసీపీకి ఉంది. కానీ జగన్ చేసిన మార్పు చేర్పులు అలాగే ఎక్కడికక్కడ ఇంచార్జిలను మార్చడం వంటివి జరిగిన తరువాత ఒక గుర్తించతగిన నంబర్ లోనే ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది అని అంటున్నారు.
అదే ఇపుడు రాజ్యసభ ఎన్నికలలో ఆసక్తిని రేపుతోంది. అదే ఇపుడు తెలుగుదేశం పార్టీలో సరికొత్త ఆశలను పెంచుతోంది. గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చివరి నిముషంలో ఒక సీటుకు పోటీ చేసి గెలిచి మరీ అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చేసింది.
ఆ చేదు అనుభవం ఒక వైపు ఉండగానే వైసీపీ అందరి కంటే ముందే ఎమ్మెల్యేల మార్పు చేర్పులు చేసింది అని అంటున్నారు. నిజానికి ఫిబ్రవరి 27 దాకా ఓపిక పడితే వైసీపీకి మూడు సీట్లూ తన ఖాతాలో ఏ బెంగా లేకుండా పడేవి అన్న మాట ఉంది. ఇపుడు చాలా మంది ఎమ్మెల్యేలు లోలోపల అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
దీంతో టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టి వారితోనే రాజకీయ పందెం కాయనుంది అని అంటున్నారు. ఏపీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే అనర్హత వేటుతో కలిపి పది మందిని పక్కన తీసేస్తే నికరంగా వైసీపీకి ఉన్న వారు 147 మంది అవుతారు. టీడీపీకి ఉన్న వారు 18 మంది అవుతారు.
ఈ నంబర్ తో టీడీపీ అసలు అభ్యర్ధిని గెలుచుకునే చాన్స్ లేనే లేదు. కానీ ఈ 147లోనూ కొందరు బయటకు వెళ్లారు. మరి కొందరు మౌనంగా ఉంటూ అగ్గి రాజేస్తున్నారు. వారి నంబర్ ఎంత అన్నదే అటు టీడీపీని ఇటు వైసీపీని కూడా బుర్రలు వేడెక్కించే ప్రశ్నగా ఉంది.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఒక్కో రాజ్యసభ అభ్యర్ధి గెలుపు కోసం 44 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. అలా చూస్తే వైసీపీకి ఏ బాధా ఇబ్బంది లేకుండా ముగ్గురికీ సునాయాసంగా గెలిపించేసుకోగలదు. ఎందుకంటే ఈ మొత్తం మూడింటికీ కావాల్సిన ఎమ్మెల్యేల నంబర్ 132 మంది మాత్రమే. వైసీపీ వద్ద 147 మంది ఉన్నారు. మరి ఇందులో పదిహేను మంది అసమ్మతిగా ఉండి ఓటేయకపోయినా కూడా వైసీపీ బేఫికర్ గా ఉండొచ్చు.
కానీ ఆ పదహారవ ఎమ్మెల్యేతోనే తంటా వస్తుంది. పదిహేను మంది లోపే అసమ్మతి ఆగిపోతుందా లేక అది ఆ పైన పాకుతుందా అన్నదే ఇపుడు పొలిటికల్ గా టెన్షన్ పెట్టే విషయం. వైసీపీ చేసిన మార్పు చేర్పులలో ఏకంగా ముప్పయి దాకా సీట్లలో కుదుపు వచ్చింది. అందులో సగం మందికి పైగా సీట్లను వేరే చోట సర్దుబాటు చేశారు.
దాంతో వారి ఇబ్బంది లేదు అనుకోవాలి. కానీ వారిలోనూ అసంతృప్తి ఉంటే కనుక మూడవ సీటు కచ్చితంగా ముంచేస్తుందా అన్నదే అసలైన ప్రశ్న. ఇది తేలాలీ అంటే ఫిబ్రవరి 27 వరకూ వేచి చూడాల్సిందే.ఆ టెన్షన్ పార్టీలతో పాటు జనాలు ఆసక్తిగా గమనించాల్సిందే.