పవన్ తో వైసీపీ మాజీ నేత భేటీ... తెరపైకి కొత్త చర్చ!
దీంతో... పవన్ తో భేటీ తరువాత తన చేరిక పైన రమేష్ బాబు స్పష్టత ఇచ్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రమేష్ బాబుకు టిక్కెట్ విషయంలో పవన్ నుంచి కచ్చితమైన హమీ దక్కినట్లు తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది. ఇదే సమయంలో వారాహియాత్ర గోదావరి జిల్లాల్లో జరిగితే ఎఫెక్ట్ పక్క ప్రాంతాల్లో కనిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ నేత.. పవన్ తో భేటీ అయ్యారనే వార్త చర్చనీయాంశంగా మారింది.
రెండు రోజుల క్రితం అధికార వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు... త్వరలో జనసేనలో చేరతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఆయన తాజాగా పవన్ తో సమావేశమయ్యారని తెలుస్తుంది.
దీంతో... పవన్ తో భేటీ తరువాత తన చేరిక పైన రమేష్ బాబు స్పష్టత ఇచ్చారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రమేష్ బాబుకు టిక్కెట్ విషయంలో పవన్ నుంచి కచ్చితమైన హమీ దక్కినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఈ నెల 20న తన అనుచరులతో కలిసి కలిసి పంచకర్ల అధికారికంగా జనసేనలో చేరనున్నారని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన పంచకర్ల... జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ పడుతున్న తపన చూసి తాను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు వెళ్లడించారని అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ ఉన్నతి కోసం పవన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తామని రమేష్ బాబు వివరించారని సమాచారం.
మరోపక్క టీడీపీ - జనసేన పొత్తు ఖాయమంటూ వార్తలొస్తున్న తరుణంలో... పొత్తు అనివార్యమని ఇరు పార్టీలూ భావిస్తున్నాయనే ఊగాహాణాలు వెలువడుతున్న సమయంలో... విశాఖలో కీలకమైన పెందుర్తి నియోజకవర్గం తెరపైకి వచ్చిందని అంటున్నారు. కారణం... పెందుర్తి నుంచి జనసేన పార్టీ తరుపున రమేష్ బాబుకు హామీ లభించిందనే చర్చ ఆసక్తికరంగా మారుతోందని అంటున్నారు పరిశీలకులు.
కాగా... పెందుర్తి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ మూర్తి పోటీ చేసిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన... 2009, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు!