రవ్వ ఇడ్లీకి ఆర్డర్ ఇచ్చి.. బాంబు పెట్టాడు!
కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే
కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. నెత్తిన క్యాప్.. ముఖానికి ముసుగు.. భుజాన బ్యాగ్ తో నిందితుడు కేఫ్ కు వచ్చాడు. అతడి వయసు 25–30 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రవ్వ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి పావు గంట తర్వాత వెళ్లిపోయాడు. ఈ మధ్యలోనే అతడు తన భుజానికి ఉన్న బ్యాగును కేఫ్ లోని సింక్ వద్ద ఉన్న డస్ట్ బిన్ పక్కనపెట్టి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన గంట తర్వాత ఆ బ్యాగ్‌లో ఉన్న ఆ బాంబు పేలింది.
ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. ఎవరూ మృత్యువాత పడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఇది ఉగ్రవాద ఘటనేనని భావిస్తోంది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సైతం పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించింది. తాజాగా ఈ కేసు దర్యాప్తు కోసం బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి వచ్చింది. నిందితుడిని పట్టుకునేందుకు ఎనిమిది బృందాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీ ఈ కేసు మొత్తానికి కీలకంగా మారింది.
రామేశ్వరం కేఫ్ లో బాంబుపేలుడుకు సంబంధించి ప్రధాన అనుమానితుడి సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. నిందితుడి కదలికలు సీసీ పుటేజీలో రికార్డు అయ్యాయి. నిందితుడు పేలుడు పదార్థం.. ఐఈడీ బ్యాగును తీసుకెళ్లి కెఫేలో ఒక మూలనపెట్టాడు. కౌంటర్ వద్దకు వెళ్లి రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్టు ఈ పుటేజీల్లో కనిపిస్తోంది.
కాగా భద్రతా సంస్థలు నిందితుడిని పట్టుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయాన్ని తొలిసారిగా తీసుకోబోతున్నాయి. ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ విధానం సాయంతో నిందితుడిని కనిపెట్టనున్నాయి. ఏఐ టెక్నాలజీ సాయంతో అతని ముఖానికి ఉన్న ముసుగును తొలగించారు. అతని ఫొటోల్ని సేకరించుకుని ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నారు.
కాగా 2022 నవంబర్ లో కర్ణాటకలోని తీర పట్టణం మంగళూరులో ఇదే తరహాలో కుక్కర్ బాంబు పేలింది. దీంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ధార్వాడ్, హుబ్లీ, బెంగళూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
అనుమానితుడెవరో తెలిసిపోయిందని.. ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ఉపయోగించి... ఆ వ్యక్తిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్ కు వచ్చాడన్నారు. రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేసి ఒక చోట కూర్చున్నాడన్నారు. తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి, వెళ్లిపోయాడన్నారు. ఫొటోలు వచ్చాయని.. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయన్నారు. ఘటనాస్థలానికి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య.. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు.