మనవరాలితో రామోజీ చెప్పిన చివరి మాటలివే!
సాధారణంగా రామోజీ కుటుంబ సభ్యులు అట్టే తమ పత్రికల్లో కథనాల రూపంలో కనిపించరు.
సాధారణంగా రామోజీ కుటుంబ సభ్యులు అట్టే తమ పత్రికల్లో కథనాల రూపంలో కనిపించరు. చాలా అరుదైన సందర్భంలోనే వారు అందులో వార్తల రూపంలో కనిపిస్తారు. రామోజీరావు ఇకలేని వేళ.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని.. ఆయన తమను తీర్చిదిద్దిన వైనం గురించి.. ఆయన తమకు ఎలాంటి విలువలు బోధించారన్న అంశంతో పాటు.. తమ జీవితాలపై తాతయ్యతో ఉన్న బంధం ఎంతన్న విషయాన్ని చెప్పేందుకు ఈనాడులోని మహిళల పేజీ అయిన ‘వసుంధర’లో ప్రత్యేక ఇంటర్వ్యూ రూపంలో ఈ రోజు అచ్చేశారు.
రామోజీ కుటుంబం విషయానికి వస్తే ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు కిరణ్. ఆయన ఈనాడు వ్యవహారాల్ని చూస్తారు. ఈనాడు ఎండీగా సుపరిచితులు. ఆయన సతీమణి శైలజ. ఆమె మార్గదర్శి వ్యవహారాల్ని చూస్తారు. చిన్న కొడుకు సుమన్. అనారోగ్యం కారణంగా మరణించిన ఆయన గురించి తెలిసిందే. ఆయన సతీమణిపేరు విజయేశ్వరి. ఇక పెద్ద కొడుక్కి ముగ్గురు సంతానం అయితే.. రెండో కొడుక్కి ఇద్దరు సంతానం. మొదటి కొడుకు (కిరణ్ - శైలజ)దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు కాగా.. రెండో కొడుక్కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి.
వారంతా కలిసి తాజాగా తమ తాతయ్యతో తమకున్న అనుబంధాన్ని చెప్పిన క్రమంలో అందరికంటే చిన్న మనమరాలు ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఆమె పేరు దివిజ. తన తాత తనతో చెప్పిన ఆఖరి మాటలు.. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా కీలకమైనదిగా చెప్పాలి. ఎందుకంటే.. తెలుగు రాజకీయాల గురించి వారు మాట్లాడుకోవటమే దీనికి ఉన్న ప్రాధాన్యం. ఆమె ఏం చెప్పారన్నది ఆమె మాటల్లోనే చదివితే బాగుంటుంది. ఆమె ఎమన్నారంటే..
‘‘ఎన్నికల ఫలితాలు వచ్చాక తాతయ్యను అడిగాను. ఏది ఏమైనా ధర్మమే గెలుస్తుంది కదా తాతయ్యా అని. అప్పుడు ఆయన(రామోజీరావు) ‘ధర్మం ఊరికే గెలవదు. దాన్ని రక్షించడానికి చాలామంది పోరాడాలి. ఎంతోమంది త్యాగాలు చేయాలి’ అని చెప్పారు. అవే ఆయన నాతో మాట్లాడిన ఆఖరి మాటలు. కడవరకూ నిజాయతీగా.. ప్రజల మంచి కోసం పోరాడిన ఆయన తత్వం.. క్రమశిక్షణలే నాకు స్ఫూర్తి. ఆయన చేసిన మంచిలో నేను పదిశాతం చేయగలిగినా చాలు. అదే సంత్రప్తి’’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇదే దివిజ మరో అంశాన్ని కూడా చెప్పుకొచ్చింది. తన తాతను ఒక సందర్భంలో ఎప్పుడూ తెల్లబట్టలే వేసుకుంటారు. మీకు బోర్ కొట్టదా తాతయ్య? అని అడిగినప్పుడు రామోజీ రావు సమాధానమిస్తూ.. ‘‘నాన్న తెలుపంటే స్వచ్ఛతకు ప్రతిరూపం. చేసే పని పట్ల కూడా మనం అంతే స్వచ్ఛంగా ఉండాలనేదానికి చిహ్నంగా ఇవి వేసుకుంటా’’ అని చెప్పినట్లుగా చెప్పారు. తనకిప్పుడు పదిహేడేళ్లు అని.. ఒక్క సందర్భంలోనూ తనను కోప్పడలేదన్న ఆమె.. ‘ఏదైనా తప్పు చేస్తే.. అది ఎందుకు తప్పో.. సరైన మార్గం ఏంటో నొప్పించకుండా ప్రేమతో చెప్పేవారు. ఇంట్లో చిన్నదాన్ని కదా. గారాబమూ ఎక్కువే. తాతయ్య ఖరీదైన బట్టలు.. చెప్పులు లాంటివి వేసుకోరు. చాలా సింఫుల్ గా ఉంటారు. ఆయన వాడే పెన్ కూడా రూ.30.చదువుల గురించే కాదు. మా ఆరోగ్యం గురించీ అనేక జాగ్రత్తలు చెప్పేవారు. త్వరలో అమెరికాలో రైటింగ్.. బిజినెస్ అంశాల మీద కోర్సులు చేయబోతున్నా. కోర్సు అయ్యాక ఫిలింమేకింగ్.. ఓటీటీ రంగాల్లో పని చేయాలనుకుంటున్నా’’ అంటూ తన ఆసక్తుల్ని ఆమె వెల్లడించారు.
మనమడు సుజయ్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల రోజున తాను తాతయ్యకు ఫోన్ చేసినట్లు చెప్పారు. ఆ రోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నారని చెప్పిన సుజయ్.. ‘‘పోతూ పోతూ ఐదు కోట్ల మందికి ఉపయోగపడగలిగా చాలు’’ అని చెప్పారన్నారు. అంతేకాదు.. తాను వెళ్లిపోయినా (మరణించిన) కన్నీటి బొట్టు కార్చకూడదని.. ఎంత కష్టంలోనూ ఏడవకూడదని చెప్పినట్లుగా తెలిపారు. తాత తమకిచ్చిన లక్ష్యాల్ని బాధ్యతల్నినెరవేరుస్తానని చెప్పారు.