బిగ్ బ్రేకింగ్: ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇక లేరు

వయసు ఎంతైనా కానీ ప్రపంచంలో ఏ మూల ఉన్న తెలుగువారికైనా తెలిసిన నాలుగైదు పేర్లలో ఒకటి చెరుకూరి రామోజీరావు.

Update: 2024-06-08 03:51 GMT

వయసు ఎంతైనా కానీ ప్రపంచంలో ఏ మూల ఉన్న తెలుగువారికైనా తెలిసిన నాలుగైదు పేర్లలో ఒకటి చెరుకూరి రామోజీరావు. మీడియా మొఘల్ గా ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ గా.. పంతం పడితే తాను అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గని రామోజీ ఇక లేరు. అనారోగ్యం కారణంగా నానక్ రాం గూడ స్టార్ ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున ఆయన స్వర్గస్తులయ్యారు. 88 ఏళ్ల వయసులోనూ నిత్యం పదహారు గంటలకు పైనే పని చేస్తూ.. ఆరేడు గంటల పాటు వార్తలు చదువుతూ.. మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకునే ఆయన ఇక గతం.

ఈ నెల 5న ఆయన శ్వాస తీసుకోవటంలో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో.. ఆయన కుటుంబ సభ్యులు నానక్ రాంగూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఆయన కోలుకుంటున్నట్లు కనిపించారు. అయితే.. శనివారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. శనివారం రాత్రి ఆయన్ను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేయటం ప్రారంభించారు. అయితే.. వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.

చిన్నస్థాయి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ ఈనాడు దినపత్రికను ప్రారంభించిన ఆయన తర్వాత వెనుదిరిగి చూసుకున్నది లేదు. మీడియా రంగంలో ఆయనేం చేసినా సంచలనమే. ఇప్పుడంటే కుప్పలుతెప్పలుగా మీడియా సంస్థలు ఉన్నాయి. కానీ.. ఆయన మీడియా సంస్థను స్టార్ట్ చేసిన సమయంలో వేళ్ల మీద లెక్కించేన్ని సంస్థలే ఉండేవి. మీడియాను ప్రజలకు మరింత చేరువు చేయటంతో పాటు.. దాని ప్రభావం వ్యవస్థల మీద ఎంత ఉందన్న విషయాన్ని చాటి చెప్పిన వ్యక్తిగా ఆయన్ను చెప్పాలి.

ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో కానీ.. ఇతర భాషల్లోని మీడియా సంస్థల్లో పని చేసే తెలుగు వారు ఎవరైనా సరే.. అత్యధికులు ఈనాడు సంస్థలో పని చేసిన బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. ఎవరు అవునన్నా.. కాదన్నా తెలుగు జర్నలిస్టులకు ఈనాడు సంస్థలు పుట్టినిల్లు లాంటిది. ఆ సంస్థలో పని చేసే జర్నలిస్టులకు క్రమపద్దతిలో శిక్షణ ఇవ్వటంతో పాటు.. ప్రతిభ ఆధారంగా వారిని అత్యున్నుత స్థానాలకు ఎదిగేలా చేయటంలో రామోజీ ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉన్నారని చెప్పాలి. ఈ రోజున వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్న ఎంతోమంది గతంలో ఈనాడు ఉంటుంది.

ఇప్పుడైతే పీడీఎఫ్ పేపర్లు సెల్ ఫోన్ లో పలుకరిస్తున్నాయి కానీ దాదాపు యాభై ఏళ్ల క్రితం దినపత్రిక ఇంటి గుమ్మం వద్దకు రావాలంటే మధ్యాహ్నం అయ్యేది. దాన్ని సమూలంగా మార్చేసి.. కష్టం ఎంతైనా తాను తీసుకొని.. దినపత్రిక చదవాలని భావించే ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందు తెల్లవారుజాముకే ఉండేలా మార్పులు చేసిన స్వాప్నికుడు రామోజీరావు. అంతేనా.. ఈటీవీ ఛానళ్లతో.. రామోజీ ఫిలింసిటీతో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు కలిగేలా చేయటంలో రామోజీ ఉన్నారని చెప్పటం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.

Tags:    

Similar News