రామ సేతు గురించి సంచలన విషయాలు వెలుగులోకి!
తేత్రాయుగంలో సీతాదేవిని లంకాధిపతి రావణాసురుడు అపహరించి శ్రీలంకలో ఆమెను నిర్బంధించాడనే విషయం తెలిసిందే
తేత్రాయుగంలో సీతాదేవిని లంకాధిపతి రావణాసురుడు అపహరించి శ్రీలంకలో ఆమెను నిర్బంధించాడనే విషయం తెలిసిందే. తన సతీమణి ఆచూకీ కనిపెట్టడానికి బయలుదేరిన శ్రీరాముడు ఆమె శ్రీలంకలో ఉందని తెలుసుకున్నాడు. శ్రీలంకకు వెళ్లడానికి తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు దాదాపు 29 కి.మీ దూరం వారధిని నిర్మించాడు. అదే ఆ తర్వాత రామ సేతుగా పిలువ బడుతుంది. ఇప్పటికీ దాన్ని చూడొచ్చు.
అయితే అది మానవ నిర్మితం కాదని, సహజసిద్ధంగా ఏర్పడిందని ఇన్నాళ్లూ పలువురు శాస్త్రవేత్తలు, హేతువాదులు చెబుతూ వచ్చారు. అసలు రామ సేతు అనేదే లేదని వాదించినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రామ సేతు ఉందని వెల్లడైంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్ శాట్ –2 ఉపగ్రహం సాయంతో ఈ విషయాన్ని తేల్చారు.
ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా శాటిలైట్ ను ఉపయోగించి రామ సేతుకు చెందిన సమగ్ర మ్యాప్ ను రూపొందించారు. 10 మీటర్ల రిజల్యూషన్ మ్యాప్ ద్వారా రామ సేతు మొత్తాన్ని చూడొచ్చు. కాగా రామ సేతులో 99.8 శాతం సముద్ర గర్భంలో మునిగి ఉంది. నాడు సముద్ర గర్భానికి 8 మీటర్ల ఎత్తులో వానర సైన్యంతో కలిసి శ్రీరాముడు రామ సేతును నిర్మించాడు. ఇది సున్నపురాయితో నిర్మించిన వారధి కావడం గమనార్హం.
ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా శాటిలైట్ ఐస్ శాట్ –2 ద్వారా అక్టోబర్ 2018 నుండి అక్టోబర్ 2023 మధ్య 6 సంవత్సరాల వ్యవధిలో రామ సేతు కు సంబంధించిన డేటాను సేకరించారు.
29 కిలోమీటర్ల పొడవు, సముద్రగర్భం నుండి 8 మీటర్ల ఎత్తులో ఉన్న సముద్రగర్భ మ్యాప్ లలో ఇదే మొదటిది. ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వివరించారు. నాసా ఉపగ్రహాన్ని ఉపయోగించి నీటిలోపలకు ఫోటాన్ లను ఉపయోగించి రామ సేతు గురించి క్లిష్టమైన వివరాలను సేకరించామని తెలిపారు.
భారత్ లోని ధనుష్కోడి – తలైమన్నార్ ప్రాంతంలో నీటి లోతు చాలా తక్కువగా ఉంది. అందుకే రామ సేతు నిర్మాణానికి ఈ ప్రాంతాన్ని నాడు ఉపయోగించుకున్నారు. గతంలో పరిశోధన చేపట్టినప్పుడు వారధి పై భాగాలకే పరిమితమయ్యారు. ఈసారి సముద్ర గర్భంలో వారధి మూలాల వరకు వెళ్లారు. లేజర్ కిరణాలను వారధి మూలాల వరకు పంపారు.
నాసా శాటిలైట్ చిత్రాల ప్రకారం.. వారధి 99.8 శాతం సముద్రంలో మునిగిపోయి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాప్‌ను రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా ఉపగ్రహం నుంచి అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు.
శాస్త్రవేత్తల బృందం 2–3 మీటర్ల లోతుతో గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి మధ్య నీటి ప్రవాహానికి అనుకూలంగా ఉన్న 11 ఇరుకైన ఛానళ్లను కనుగొంది. నీటి అడుగున ఉన్న వారధి సున్నపురాయి గుంటల గొలుసుతో తయారు చేయబడింది.
క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను ‘సేతు బంధై’ అని పిలిచేవారు. ప్రఖ్యాత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం.. రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం.. ఈ వంతెన 1,480 వరకు తుఫాను కారణంగా ధ్వంసమయ్యే వరకు సముద్ర మట్టానికి పైనే ఉండటం విశేషం.