రన్యారావు కేసులో తవ్వేకొద్దీ సంచలన నిజాలివీ

కేవలం డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లే కాదు, ప్రయాణికుల హ్యాండ్ బ్యాగేజీ , శరీరాన్ని స్కాన్ చేసే మెటల్ డిటెక్టర్లు కూడా కనిపించలేదని రాష్ట్ర పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.;

Update: 2025-03-24 08:11 GMT

కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈనెల 3న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12 కోట్లకు పైగా విలువైన బంగారంతో పట్టుబడిన ఆమె వ్యవహారంలో అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ అధికారులు జరిపిన సోదాల్లో ఆమె నివాసంలో మరో రూ.3 కోట్ల విలువైన నగలు, నగదు లభ్యమయ్యాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా, విమానాశ్రయంలోని భద్రతా లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర అధికారుల బృందం విమానాశ్రయాన్ని పరిశీలించిన అనంతరం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు ఏమాత్రం సరిగా లేవని తేల్చారు. కస్టమ్స్ ప్రాంతంలోకి ప్రవేశించే ముందు ఉండాల్సిన డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు (DFMD) అక్కడ లేకపోవడం అధికారులను షాక్‌కు గురిచేసింది. ఇది అత్యంత పెద్ద భద్రతా వైఫల్యంగా వారు అభివర్ణించారు.

కేవలం డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లే కాదు, ప్రయాణికుల హ్యాండ్ బ్యాగేజీ , శరీరాన్ని స్కాన్ చేసే మెటల్ డిటెక్టర్లు కూడా కనిపించలేదని రాష్ట్ర పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా విమానాశ్రయంలో నిఘా వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉందని, తనిఖీలు కూడా నామమాత్రంగానే జరుగుతున్నాయని గుర్తించారు. మెటల్ డిటెక్టర్లు లేకపోవడం వల్లే రన్యారావు ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతా తనిఖీల నుంచి తప్పించుకోగలిగిందని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు రన్యారావు తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు పలుకుబడిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుండి వచ్చిన ప్రతిసారీ ఆమె పోలీస్ ప్రొటోకాల్ సేవలను వినియోగించుకుని బయటకు వచ్చేసినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి పోలీస్ ప్రొటోకాల్ సేవలు కేవలం ఎస్పీ , అంతకంటే ఎక్కువ స్థాయి అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే రన్యారావు తన తండ్రిని అడ్డుపెట్టుకుని ఈ సేవలను దుర్వినియోగం చేసింది. ఈ ఘటనతో పోలీస్ శాఖ పోలీస్ ప్రొటోకాల్ సేవలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఈ కేసులో రన్యారావుతో పాటు తెలుగు నటుడు తరుణ్ రాజును కూడా డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో వీరిద్దరూ పలుమార్లు దుబాయ్ వెళ్లి వచ్చారు. మార్చి 3న కూడా వీరిద్దరూ కలిసి దుబాయ్ వెళ్లగా, తరుణ్ రాజు మరో ప్రాంతానికి వెళ్తున్నానని చెప్పి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. రన్యారావు మాత్రం బెంగళూరు విమానాశ్రయంలో దిగింది. డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని మొబైల్ ఫోన్ చెక్ చేయగా తరుణ్ రాజు విషయం బయటపడింది.

ఇదిలా ఉండగా, రన్యారావు నాలుగేళ్ల క్రితం ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరిని వివాహం చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం వారు విడివిడిగా ఉంటున్నారు. అయితే వారికి ఇంకా విడాకులు కాలేదని జతిన్ తెలిపారు.

మొత్తానికి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో విమానాశ్రయ భద్రతా లోపాలు, పోలీస్ ప్రొటోకాల్ దుర్వినియోగం వంటి అంశాలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. అధికారులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News