రాయపాటి వల్ల ఏమిటి ఉపయోగం ?

రాయపాటి వైసీపీలోకి మారేందుకు ప్రయత్నాలు

Update: 2023-07-15 09:14 GMT

రాయపాటి సాంబశివరావు వల్ల ఏమిటి ఉపయోగం అనే విషయమై ఇపుడు గుంటూరు జిల్లాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాయపాటి వైభవం అన్నది చరిత్రగా మిగిలిపోయింది. కాంగ్రెస్ హయాంలో ఆయన ఒక వెలుగు వెలిగింది వాస్తవమే. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి నరసరావుపేట ఎంపీగా గెలిచారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుండి దాదాపు తెరమరుగు అయిపోయారు. ఏదో లేస్తే మనిషినికాదన్నట్లుగా మాట్లాడుతు నెట్టుకొస్తున్నారు.

అనారోగ్యం కారణంగా వీల్ చైర్ కే పరిమితమైపోయిన రాయపాటి రాజకీయ ప్రాభవం ఎప్పుడో కోల్పోయారు. ఆయన వారసులు కూడా పెద్దగా లైమ్ లైట్లో లేరు. కొడుకు రంగారావును ఎంపీ లేదా ఎంఎల్ఏని చేయాలన్నది రాయపాటి కోరిక. అయితే అందుకు అవకాశాలు దాదాపు కనబడటంలేదు. తనకు బద్ధశతృవైన కన్నా లక్ష్మీనారాయణను చంద్రబాబునాయుడు టీడీపీలో చేర్చుకున్నారు. సత్తెనపల్లికి ఇన్చార్జిగా నియమించారు. ఇన్చార్జంటే దాదాపు రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధిగానే చూడాలి. అందుకనే చంద్రబాబు, కన్నాపైన రాయపాటి మండిపోతున్నారు.

ఈ నేపధ్యంలోనే రాయపాటి వైసీపీలోకి మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. నిజానికి రాయపాటి అవసరం వైసీపీకి ఇప్పుడేమీ లేదు. ఒకవేళ రాయపాటిని పార్టీలోకి చేర్చుకుంటే అనవసరమైన గొడవలను తలకెత్తుకున్నట్లవుతుంది తప్ప లాభంలేదు. ఇప్పటికే పెదకూరపాటు, సత్తెనపల్లి, నరసరావుపేటలో వైసీపీ ఎంఎల్ఏలున్నారు.

వీళ్ళని కాదంటే టికెట్లిచ్చేందుకు ద్వితీయశ్రేణి నేతలున్నారు. ఈ సమయంలో రాయపాటిని చేర్చుకుంటే పార్టీలో అభద్రత మొదలవుతుంది. దాంతో పార్టీ నేతల మధ్య గొడవలు మొదలవ్వటం ఖాయం.

రాయపాటిని చేర్చుకుంటే పార్టీలో గొడవలయ్యేటపుడు అసలు చేర్చుకోవటం అవసరమా అనే టాక్ పార్టీలో మొదలైంది. రాయపాటి వల్ల నష్టమే కానీ ఎలాంటి లాభంలేనపుడు చేర్చుకునే విషయమై అసలు ఆలోచన కూడా అనవసరమని నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలో చెల్లుబాటు కాని రాయపాటి వైసీపీలో మాత్రం ఎలా చెల్లుబాటు అవుతారనే చర్చ నడుస్తోంది.

పార్టీలో చర్చ ఎలాగున్నా జిల్లాలో మాత్రం రాయపాటికి వ్యతిరేకంగానే చర్చలు జరుగుతున్నది వాస్తవం. మరి ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళుతున్నాయా అన్నదే తెలీటంలేదు. తన శిష్యుడు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ద్వారా రాయపాటి పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News