దేశంలో హత్యలు జరగడానికి కారణాలేంటి?
ముందు రెండేళ్లతో పోల్చితే గతేడాది హత్యలు తగ్గాయి. దేశంలో జరిగే హత్యలకు సాధారణ ఉద్దేశాలే కారణమని తేల్చుతున్నారు.
హత్యలు, ప్రమాదాల బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు జాతీయ నేర గణాంకాల విభాగం గతేడాది వెల్లడించిన వివరాల నివేదికను విడుదల చేసింది. ముందు రెండేళ్లతో పోల్చితే గతేడాది హత్యలు తగ్గాయి. దేశంలో జరిగే హత్యలకు సాధారణ ఉద్దేశాలే కారణమని తేల్చుతున్నారు. వ్యక్తిగత పగ, అక్రమ సంబంధాలు, భూ తగాదాలు వంటి వాటి కారణంగా ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. దీంతో ప్రాణాలతో చెలగాటమాడొద్దని తెలిసినా పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తోడేస్తున్నారు.
దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన తాజా నివేదికలో గతేడాది దేశంలో 28,522 హత్యలు నమోదయ్యాయి. ఇందులో రోజువారీ సగటు 78గా తేల్చారు. 2020-21 సంవత్సరాలతో పోల్చితే కేసులు తగ్గాయి. క్రైమ్ ఇన్ ఇండియా 2022 నివేదిక ప్రకారం 2021లో 29,272, 2020లో 29,193 కేసులు వెల్లడయ్యాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా తరువాత స్థానాల్లో బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ లు నిలిచాయి.
అత్యల్పంగా సిక్కిమ్, నాగాలాండ్, మిజోరామ్, గోవా, మణిపూర్ లు ఉన్నాయి. కేంద్రపాలితప్రాంతాల్లో జమ్ముకాశ్మీర్, పుదుచ్చేరి, చండీఘర్, దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్, లడక్, లక్ష్యద్వీప్ లు నమోదయ్యాయి. హత్యలకు గురైన వారిలో 95 శాతం మంది 20 ఏళ్లు దాటిన వారే. 8,125 మంది మహిళలున్నారు. పురుషులు70 శాతం మంది ఉన్నారు.
2022లో జరిగిన అత్యధిక హత్యల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లు ఉన్నాయి. వ్యక్తిగత పగలు, శత్రుత్వం వల్ల బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక ముందంజలో నిలిచాయి. నరబలి, క్షుద్రపూజలు, వరకట్నం, ప్రేమ వ్యవహారాలు, కులతత్వం వంటి కారణాలతో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ప్రధాన నగరాలైన ముంబయి, కోల్ కత, పుణే, హైదరాబాద్ నగరాలు సురక్షితమైనవిగా తేల్చారు. ఇక్కడ నివాసం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది. ఈనేపథ్యంలో మత విద్వేషాలు, వర్గపోరాటాలు, పరువు హత్యలు లాంటివి కూడా కారణాలుగా నిలుస్తున్నాయి. ఇలా మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోందని గణాంకాలు తెలియజేస్తున్నాయి.