ఈసారి రెబెల్స్ ఎంతమంది ?

శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే పాతపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ నామినేషన్ వేస్తానని రెబెల్ గా బరిలో ఉంటానని చెబుతున్నారు.

Update: 2024-04-22 04:48 GMT

ఈ ప్రశ్నకు జవాబు బహుశా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత రావచ్చు. అంటే ఈ నెల 29 సాయంత్రానికి లెక్క తేలిపోతుంది. రెబెల్స్ గా బరిలో ఉంటామని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా చాలా మంది నేతలు ప్రకటించారు. అందులో కొందరు నామినేషన్లు వేశారు. మరికొందరు వేయబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే పాతపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ నామినేషన్ వేస్తానని రెబెల్ గా బరిలో ఉంటానని చెబుతున్నారు.

పార్టీ ఆయనకు కాకుండా ఈసారి కొత్త నేత అయిన మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చింది. దాంతో ఆయన హర్ట్ అయ్యారు. టీడీపీ అధినాయకత్వం మాట్లాడినా ఆయన చల్లబడలేదు. బలమైనేత గా వెంకట రమణ ఉన్నారు. తండ్రి కలమట మోహనరావు టైం నుంచి ఆ కుటుంబం అనేకసార్లు పాతపట్నంలో గెలిచింది. దాంతో కలమట పోటీ నిజంగా రెబెల్ గా ఉంటారా అన్నది చూడాల్సి ఉంది.

అదే జిల్లాలో శ్రీకాకుళం సీటు దక్కలేదని మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మండిపోతున్నారు. ఆయన సతీమణి లక్ష్మీదేవికి 2014లో టికెట్ ఇస్తే గెలిచారు. 2019లో ఓటమి పాలు అయ్యారు. 2024లో ఆశలు పెట్టుకుంటే గోండు శంకర్ కి టికెట్ ఇచ్చారు దాంతో మాజీ మంత్రి ఎంపీగా లక్ష్మీదేవి ఎమ్మెల్యేగా పోటీ చేయలని అనుచరులు కోరుతున్నారు. గుండ కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు.

విజయనగరం జిల్లాలో చూస్తే గజపతినగరం నుంచి మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు రెబెల్ గా రేసులో ఉంటారు అని అంటున్నారు. అలాగే విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ ఇద్దరూ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం పట్ల మండిపోతున్నారు. పార్వతీపురంలో చూస్తే మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవి టీడీపీ టికెట్ ఇవ్వలేదని రగులుతున్నారు.

విశాఖ జిల్లాలో మాడుగుల నుంచి ఎన్నారై పైలా ప్రసాదరావు నామినేషన్ అయితే వేసేశారు. కానీ బీఫారాన్ని పెందుర్తి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి పార్టీ ఇచ్చింది. ప్రసాదరావు రెబెల్ గా కొనసాగుతారా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారా చూడాల్సి ఉంది.

గోదావరి జిల్లాలలో కూడా కొన్ని చోట్ల ఇలాంటి సీన్లు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు రామరాజు, శివరామరాజులలో ఒకరు కచ్చితంగా రెబెల్ గా పోటీ చేస్తారు అని అంటున్నారు. అలాగే ఉమ్మడి క్రిష్ణ అజిల్లా నూజివీడు నుంచి టీడీపీ సీనియర్ నేత ముద్దబోయిన వెంకటేశ్వరరావు రెబెల్ గా పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం నెల్లూరులలో కూడా తమ్ముళ్లు కొందరు మండుతున్నారు.

ఇక రాయలసీమలో చూస్తే కొంతమంది రెబెల్ గా వేయాలా లేక వైసీపీలో చేరాలా అన్నది చూస్తున్నారు. అనంతపురంలో అయితే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని పోటీ చేయమని తమ్ముళ్ళు కోరినా అయన డ్రాప్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే ధర్మవరం నుంచి వరదాపురం సూరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. అలాగే కర్నూల్, చిత్తూరులలో కొంతమంది రెబెల్స్ గా రంగంలోకి దిగుతారు అని అంటున్నారు.

అయితే రెబెల్ గా పోటీకి ఆవేశం ఒక్కటే సరిపోదు, ఖర్చు చూస్తే తడిసి మోపెడు అవుతుంది. అంతే కాదు సొంతంగా క్యాడర్ ని తయారు చేసుకుని జనంలోకి వెళ్లాలి. వారి మద్దతు పొందాలి ఓడినా గౌరవప్రదంగా ఉండాలీ అంటే చాలానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే రెబెల్ గా పోటీ అన్న వారు చాలా మంది అంటే నూటికి ఎనభై నుంచి తొంబై శాతం నామినేషన్ల విత్ డ్రా తరువాత తప్పుకునే చాన్స్ ఉందనే అంటున్నారు. ఈసారి రెబెల్స్ లెక్క ఎంత అన్నది మాత్రం మరో వారానికి కానీ తెలియదు అనే అంటున్నారు.

Tags:    

Similar News