సెల్ ఫోన్ల రికవరీ.. అగ్రస్థానంలో తెలంగాణ!
సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ టెక్నాలజీ సాయంతో పోయిన సెల్ ఫోన్లను గుర్తించి.. వాటిని వాటి యజమానులకు అందిస్తున్నారు.
పాజిటివ్ అంశాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందు ఉన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం తరచూ చెబుతూ ఉంటుంది. తాజాగా మరో అంశంలోనూ తెలంగాణ రాష్ట్రమే ముందున్న విషయం రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలోనూ తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచినట్లుగా పేర్కొంటున్నారు. సెల్ ఫోన్ ను ఎవరైనా పోగొట్టుకొన్నట్లైయితే.. ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు రూపంలో ఇస్తే.. పోయిన ఫోన్లను గుర్తించేందుకు వీలుగా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ టెక్నాలజీ సాయంతో పోయిన సెల్ ఫోన్లను గుర్తించి.. వాటిని వాటి యజమానులకు అందిస్తున్నారు. ఈ సాంకేతికతను వినియోగించటం ద్వారా పోయిన సెల్ ఫోన్లను పెద్దఎత్తున రికవరీ చేయటంలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్న విషయాన్ని సీఐడీ ఆడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 20నుంచి అక్టోబరు 26 మధ్య కాలంలో 10,018 ఫోన్లను గుర్తించి.. రికవరీ చేసినట్లుగా ఆయన చెప్పారు.
ఇంత భారీ ఎత్తున సెల్ ఫోన్లను రికవరీ చేయటంలో దేశంలోని మరే రాష్ట్రం కూడా తెలంగాణ మాదిరి లేదని చెబుతున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లను వాటి యజమానులకు తిరిగి ఇచ్చారు. సీఈఐఆర్ టెక్నాలజీ వినియోగంతో మొత్తం రికవరీ ఫోన్లలో 39 శాతం వాటా ఉన్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. 86,395 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ లో బ్లాక్ చేసినట్లుగా వెల్లడించారు. మొబైల్ ఫోన్ల ను ఇంత పెద్ద ఎత్తున రికవరీ చేసిన పోలీసు టీంను రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు