ట్రిపుల్ ఆర్ ఇన్ వైసీపీ !

ట్రిపుల్ ఆర్ అంటే గభాలుగా మాజీ వైసీపీ ఎంపీ రెబెల్ నేత రఘురామ క్రిష్ణం రాజు అని అనుకునేరు.

Update: 2024-07-10 03:49 GMT

ట్రిపుల్ ఆర్ అంటే గభాలుగా మాజీ వైసీపీ ఎంపీ రెబెల్ నేత రఘురామ క్రిష్ణం రాజు అని అనుకునేరు. ఆయన కానే కాదు. ఈ ట్రిపుల్ ఆర్ వేరు. వీరు వైసీపీలో ఉన్నారు. కీలకమైన స్థానాలలో ఉన్నారు. వారే వైసీపీ తరఫున పార్లమెంట్ లో కీలక హోదాలలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డి. వీరినే ట్రిపుల్ ఆర్ అంటే రెడ్ల త్రయం అని సెటైరికల్ గా ప్రత్యర్ధులు అంటున్నారుట.

ఇక చూస్తే వైసీపీకి లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు. మొత్తంగా 15 మంది ఎంపీలు అన్న మాట. ఈ పదిహేను మందికి కలిపి పార్లమెంటరీ పార్టీ నేత అని ఒక పోస్ట్ ఉంది. దానికి ఈ ట్రిపుల్ ఆర్ అదే రెడ్ల త్రయంలో ఒకరైన వైవీ సుబ్బారెడ్డికి ఈ పోస్టు ఇచ్చారు.

అదే విధంగా లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా మిధున్ రెడ్డికే జగన్ బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి వైసీపీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ మూడు కీలక పోస్టులలో ట్రిపుల్ ఆర్ లనే జగన్ సెట్ చేశారు అన్న మాట. దాని మీదనే ఇపుడు అంతా విమర్శలు చేస్తున్నారుట.

నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పే జగన్ ఈ కీలకమైన పదవులు ఎందుకు ఈ సామాజిక వర్గాల వారికి ఇవ్వలేదు అన్న చర్చ అయితే నడుస్తోంది. రెండు సార్లు ఎంపీగా గెలిచిన తిరుపతి లోక్ సభ సభ్యుడు గురుమూర్తి రెడ్డికి లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా అవకాశం ఇస్తే ఎంత బాగుండేది అన్న చర్చ ఉంది.

అలాగే రాజ్యసభలో బీసీ ఎంపీలు వైసీపీకి పెద్ద ఎత్తున ఉన్నారు. వారిలో ఒకరికి సభా పక్ష నేత హోదా ఇస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు. అలాగే పార్లమెంటరీ పార్టీ నేతగా బీసీల నుంచి ఎంపిక చేస్తే వైసీపీకి కూడా రాజకీయంగా ప్రయోజనకరంగా ఉండేది అన్న సూచనలు వస్తున్నాయి.

అయితే జగన్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఆయన నినాదాలు బీసీలు ఎస్సీలు అని ఇచ్చినా ఆచరణలో మాత్రం తన బిజినెస్ పార్టనర్లనే ముందు పెట్టి పదవులు వారికే కట్టబెడుతున్నారు అన్న విమర్శలు అయితే వస్తున్నాయి. రాజకీయ పార్టీ ఏదైనా అన్ని కులాలను సమానంగా చూడాలి. అఫ్ కోర్స్ చూసినట్లుగా అయినా కనిపించాలి. కానీ అలాంటిది ఏదీ లేకుండా ఎవరు ఏమనుకున్నా ఏమిటి అన్నట్లుగా ఒకే సామాజిక వర్గానికి పదవులు అన్నీ కట్టబెడితే విమర్శల దాడి తప్పదనే అంటున్నారు. దాంతోనే వైసీపీలో ట్రిపుల్ ఆర్ అని ప్రత్యర్ధులు సెటైర్లు వేసేందుకు ఆస్కారం కలిగింది అని అంటున్నారు.

Tags:    

Similar News