హాట్ టాపిక్: ఏసీబీ కోర్టులో తిరస్కరణ... సుప్రీంకోర్టులో వాయిదా

ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కాం కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Update: 2023-10-20 06:41 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబు బయటకు వచ్చేది ఎప్పుడు అనే చర్చ టీడీపీ శ్రేణుల్లో విపరీతంగా జరుగుతుందని అంటున్నారు. మరోపక్క భువనేశ్వరి, లోకేష్ లు బాధ్యతలు పంచుకుంటుండటంతో... మరికొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు కేసులకు సంబంధించి ఈ రోజు పలు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అందులో భాగంగా... ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా:

అవును... సెప్టెంబర్ 9వ తేదీన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు.. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఏసీబీ కోర్టు రిమాండ్ మరో 14 రోజులు పొడిగించింది. మరోవైపు సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరంన క్వాష్ పిటీషన్ పై తీర్పు రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో నేడు ఫైబర్‌ నెట్‌ స్కాం కేసు విచారణ వాయిదా పడింది!

ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కాం కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్‌ 8కి వాయిదా వేసింది.

ఇదే సమయంలో... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసుపై తీర్పు తర్వాత ఫైబర్‌ నెట్‌ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీం కోర్టు తెలిపింది. అప్పటి వరకు పీటీ వారెంట్‌ పై యథాతథ స్థితి కొనసాగించాలని, అప్పటివరకూ ఈ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.

క్వాష్ పిటిషన్ పై కీలక నిర్ణయం:

చంద్రబాబు కేసులకు సంబంధించి సుప్రీంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ విచారణను నవంబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు... స్కిల్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పును నవంబర్ 8న వెల్లడిస్తామని స్పష్టం చేసింది. దీంతో, అప్పటి వరకు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి... రేపటి నుంచి ఈనెల 29 వరకు కోర్టుకు దసరా సెలవులు. అయితే ఇప్పటికే క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేయటంతో ఈ రోజు తీర్పు వెలువరిస్తారనే అంచనాలు ఉన్నాయి. చాలా మంది అదే అభిప్రాయంతో ఉన్నారనే కామెంట్లు వినిపించాయి. కానీ, ఈ తీర్పుకు సంబంధించి తాజాగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. నవంబర్ 9కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

లీగల్‌ ములాఖత్‌ పిటిషన్‌ తిరస్కరణ:

విజయవాడ ఏసీబీ కోర్టులో నేడు చంద్రబాబు మూడు పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇందులో భాగంగా... ఫైబర్ నెట్ స్కామ్‌ కేసులో పీటీ వారెంట్‌పై విచారణ, కాల్ డేటా రికార్డింగ్ (సీడీఆర్‌) పిటిషన్‌ తో పాటు లీగల్ ములాఖాత్ల సంఖ్య మూడుకి పెంచాలని వేసిన పిటిషన్ లపై ఈ రోజు విచారణ జరగనుంది. తాజా సమాచారం ప్రకారం ములాఖాత్ల సంఖ్య పెంచే పిటిషన్ ను కోర్టు కొట్టేసిందని తెలుస్తుంది.

చంద్రబాబు లీగల్‌ ములాఖత్‌ పిటిషన్‌ ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందని తెలుస్తుంది. లీగల్‌ ములాఖత్‌ లను మూడుకు పెంచాలని గురువారం చంద్రబాబు తరుపు లాయర్లు పిటిషన్‌ వేశారు. అయితే ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్‌ ను కోర్టు తిరస్కరించింది!

మరోపక్క ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ నవంబర్‌ 9వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు... స్కిల్ స్కాం కేసులో తీర్పు ఇచ్చేవరకు ఆగాలని బాబు లాయర్లకు సూచించింది. కాగా... ఈ నెల 21 నుంచి 29 దాకా కోర్టుకు దసరా సెలవులు అనే విషయం తెలిసిందే!

Tags:    

Similar News