మైనారిటీలు ఓటు బ్యాంకు కాదంటోన్న రేవంత్
కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఓటు బ్యాంకు కాదని, వారు తమ సోదరుల వంటి వారని, కుటుంబ సభ్యుల వంటి వారని రేవంత్ అన్నారు.
ప్రధాని మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒకటి మోదీ పరివార్.. రెండోది గాంధీ పరివార్ మాత్రమే ఉన్నాయని రేవంత్ అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివార్ చూస్తుంటే..దేశ సమైక్యత కోసం గాంధీ పరివార్ కృషి చేస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఓటు బ్యాంకు కాదని, వారు తమ సోదరుల వంటి వారని, కుటుంబ సభ్యుల వంటి వారని రేవంత్ అన్నారు.
హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు అని, వారు అండగా ఉంటే విద్య, వైద్యం, ఉపాధిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశమిచ్చిందని..కానీ, ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తే కేంద్రంలో మోదీ సర్కార్ కు మద్దతిస్తాయని చెప్పారు. మోదీ పరివార్‌తో ఉండాలో గాంధీ పరివార్‌తో ఉండాలో నిర్ణయించుకోవాలని మైనారిటీలకు రేవంత్ సూచించారు.
అయితే, ముస్లిములు అప్పుడప్పుడు కాంగ్రెస్ పై అలుగుతుంటారని అన్నారు. అయినాసరే, వారిని తాము ఓటర్లుగా చూడబోమని, సోదరులుగా, కుటుంబ సభ్యులుగా చూస్తున్నామని తెలిపారు. మైనారిటీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదని, కాబట్టి మైనారిటీ మంత్రి అవకాశం లేదని చెప్పారు. అందుకే, షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించామని, అమీర్ అలీ ఖాన్‌కు ఎమ్మల్సీ ఇచ్చామని గుర్తు చేశారు. 8 కార్పొరేషన్లలో మైనారిటీలకు అవకాశమిచ్చామని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత సీఎంవోలో మైనారిటీ అధికారిని నియమించామని గుర్తు చేశారు.